దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఆలోచనలు ఎప్పుడూ గొప్పగా ఉంటాయి. మామూలుగా దర్శకులు సినిమా సినిమాకి తమ స్థాయిని పెంచుకుంటూ ఉంటారు. కానీ రాజమౌళి మాత్రం సినిమా సినిమాకి తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు. అందుకే స్టార్ హీరోల రేంజ్ లో దర్శకధీరుడికి ఎందరో అభిమానులు ఉంటారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో గ్లోబల్ లెవెల్ లో సత్తా చాటిన జక్కన్న.. తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో 29వ చిత్రంగా రానున్న ఈ ఫిల్మ్.. ఇండియానా జోన్స్ తరహాలో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా కోసం హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ రంగంలోకి దిగుతున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది.
‘టైటానిక్’, ‘అవతార్’ వంటి అద్భుతాలను సృష్టించిన జేమ్స్ కామెరాన్ వరల్డ్ లోనే టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. అలాంటి దిగ్గజ దర్శకుడు.. రాజమౌళి ప్రతిభకు ఫిదా అయ్యారు. జక్కన్న గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. జేమ్స్ కామెరాన్ సహా ఎందరో హాలీవుడ్ ప్రముఖులని మెప్పించింది. ముఖ్యంగా జేమ్స్ కామెరాన్ పలు సందర్భాల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని, దర్శకుడు రాజమౌళిని ఎంతగానో ప్రశంసించారు. ఆస్కార్స్ అవార్డ్స్ వేడుక సమయంలో ప్రత్యక్షంగా కలిసి మరీ జక్కన్నను అభినందించారు. ఈ క్రమంలో జేమ్స్ కామెరాన్ కి, రాజమౌళికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఈ అనుబంధమే ఇప్పుడు ‘SSMB 29’ కోసం జేమ్స్ కామెరాన్ ని ఇండియాకి రప్పిస్తున్నట్లు సమాచారం.
ఒక భారీ ప్రెస్ మీట్ నిర్వహించి, తన కొత్త సినిమా ఎలా ఉండబోతుందో ముందుగానే వివరించడం రాజమౌళి శైలి. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో అదే చేశారు. ఇప్పుడు ‘SSMB 29’ కోసం కూడా అదే చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియా సమక్షంలో భారీ ప్రెస్ మీట్ నిర్వహించి.. చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని చూస్తున్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ కి ముఖ్య అతిథిగా జేమ్స్ కామెరాన్ ని తీసుకురావాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కామెరాన్ సైతం ఈ కార్యక్రమానికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారట. కుదిరితే ప్రెస్ మీట్ కి లేదంటే మూవీ లాంచ్ కి ఇలా ఏదో ఒక కార్యక్రమానికి జేమ్స్ కామెరాన్ గెస్ట్ గా రావడం దాదాపు ఖాయమని చెబుతున్నారు. అదే జరిగితే ఓపెనింగ్ తోనే ‘SSMB 29’ సినిమా గురించి ఇంటర్నేషనల్ మీడియాలో మారుమోగిపోతుంది అనడంలో సందేహం లేదు. మొత్తానికి తెలుగు సినిమా ఓపెనింగ్ గురించి ఇంటర్నేషనల్ మీడియాలో మారుమోగేలా చేయాలంటే రాజమౌళికే సాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.