ByGanesh
Thu 08th Feb 2024 06:21 PM
ఏపీలో పొత్తుల అంశం క్లైమాక్స్‌కు అయితే చేరుకుంది. టీడీపీ, బీజేపీ మధ్య సమావేశాలు నడుస్తున్నాయి. ఇవి ఓకే అయితే టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ కూడా వచ్చి చేరుతుంది. పొత్తు పెట్టుకునే విషయంలో అయితే మూడు పార్టీలకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ సీట్ల విషయానికి వచ్చేసరికి కాస్త తేడాలు వస్తున్నాయి. ఏపీలో ఏమాత్రం పట్టులేని బీజేపీ సైతం పెద్ద సంఖ్యలో సీట్లు కోరుతోందని సమాచారం. అయితే శక్తికి మించి బీజేపీ సీట్లు కోరితే మాత్రం అంగీకరించవద్దని సీనియర్లు టీడీపీ అధినేత చంద్రబాబుకు సూచించారట. పొత్తు ఉభయతారకంగా ఉంటే ఓకే కానీ లేదంటే లైట్ తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.
వ్యతిరేకత రావడం ఖాయం..
ఇప్పటికే జనసేనతో పొత్తు కారణంగా దాదాపు 40 సీట్లు ఆ పార్టీకి వెళ్లిపోయాయని తెలుస్తోంది. ఇక బీజేపీకి సైతం ఎన్ని కోరితే అన్ని స్థానాలు ఇచ్చేస్తే పార్టీ నుంచి వ్యతిరేకత రావడం ఖాయమని చంద్రబాబుకు సీనియర్లు సూచించారట. దీంతో 10 అసెంబ్లీ, మూడు ఎంపీ స్థానాల వరకూ బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని టాక్. అయితే బీజేపీ ఆశలు మాత్రం పెద్దగానే ఉన్నాయి. బీజేపీ 25 అసెంబ్లీ, దాదాపు 8 ఎంపీ స్థానాలు కోరుతోందట. నేడు అమిత్ షాతో భేటీ తర్వాత కానీ సీట్ల విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే నిన్న మొన్నటి వరకూ అంటీముట్టనట్టుగా ఉన్న బీజేపీ నేడు పొత్తుకు ముందుకు రావడానికి కారణాలు లేకపోలేదు.
టీడీపీతో పొత్తుకు సిద్ధం..
ప్రస్తుతం బీజేపీ హవా బాగానే ఉంది. అయోధ్య రామ మందిర నిర్మాణంతో ఆ పార్టీ గ్రాఫ్ బాగానే పెరిగింది. దీంతో తమకు 370 సీట్లు వస్తాయని బీజేపీ అంచనా వేస్తోందట. మిగతా స్థానాల కోసం పొత్తులకు ముందుకు వస్తుంది. ఎక్కడ ఏ ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశముందో సర్వే చేయించి దాని ద్వారా ముందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీతో పొత్తుకు సిద్ధమైంది. బీజేపీ మాత్రం అసెంబ్లీ స్థానాల విషయంలో లైట్ తీసుకున్నా.. ఎంపీ స్థానాల విషయంలో మాత్రం పట్టుబట్టే అవకాశం ఉంది. ఇక చంద్రబాబు సైతం ఎన్ని స్థానాలివ్వాలనే విషయంలో క్లారిటీతోనే ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ చేతిలో అధికారముంది. పోలీస్ యంత్రాంగమంతా చేతిలో ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని టీడీపీ భావిస్తోంది.
TDP-BJP alliance likely:
Chandrababu Naidu meets Amit Shah, JP Nadda