CM Revanth Comments on Caste Census in Telangana Assembly: బీసీ కులగణన విషయంలో ఎలాంటి అపోహలొద్దని.. బలహీన వర్గాలను బలోపేతం చేయడమే తమ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీసీ కులగణనపై శుక్రవారం అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా.. ఈ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని అన్నారు. మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతోనే ఈ తీర్మానాన్ని సభ ముందుకు తెచ్చామని వెల్లడించారు. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టారా.? అని ప్రశ్నించారు.
పాలితులను పాలకులను చేయడమే లక్ష్యం
తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ కులగణనపై మంత్రివర్గంలో తీర్మానం ప్రవేశపెట్టామని.. ఎవరూ అడగకుండానే సభలో ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ అన్నారు. పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించి వాళ్ల ఆర్థిక ప్రయోజనాలను నిలబెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. ‘కులగణనపై చర్చను ప్రతిపక్షం తప్పుదోవ పట్టిస్తోంది. కులగణనను అమలు చేసే క్రమంలో న్యాయ, చట్టపరమైన చిక్కులపై అనుమానం ఉంటే సూచనలివ్వండి. అంతేకానీ, తీర్మానానికే చట్టబద్ధత లేదన్నట్లుగా మాట్లాడడం మనందరికీ మంచిది కాదు. మేం రహస్యంగా ఏమీ చేయడం లేదు. ఈ తీర్మానంపై రాష్ట్ర జనాభాలో అరశాతం ఉన్న వాళ్లకు బాధ ఉండొచ్చు. రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాం. లెక్కలు బయటకు వస్తే 50 శాతం జనాభా ఉన్న వాళ్లకు రాజ్యాధికారంలో ఎక్కడ భాగం ఇవ్వాల్సి వస్తుందోనన్న బాధ ఉంటుందేమో.?. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రావాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్తశుద్ధిపై మాకు ఎలాంటి అనుమానం లేదు. కానీ సహవాస దోషం అన్నట్టుగా కొంతమంది పక్కన కూర్చోవడంతో ఆయన్నూ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇంత మంచి తీర్మానం చేసినప్పుడైనా దాన్ని స్వాగతించి సూచనలు చేయాల్సిందిగా కోరుతున్నాం. సహేతుకమైన సూచనలను మేం పరిగణలోకి తీసుకుంటాం.’ అని రేవంత్ స్పష్టం చేశారు.
‘మేనిఫెస్టోపై చర్చిద్దామా.?’
కులగణనపై ప్రజలకు అనుమానం లేవనెత్తేలా విపక్షాల వ్యాఖ్యలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చట్ట సభల్లో అన్ని కులాలకు న్యాయం చేసేందుకు కులగణన ప్రక్రియ చేపట్టామని అన్నారు. దీనిపై మాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని.. గతంలో కాంగ్రెస్ హయాంలో జస్టిస్ కమిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చేశామని గొప్పలు చెప్పుకొనే బీఆర్ఎస్ నేతలు.. ఆ సర్వేను సభలో ప్రవేశపెట్టారా.? అని నిలదీశారు. ‘మేనిఫెస్టోలపై ఓ రోజు చర్చిద్దాం. 2014, 2018, 2023లో పార్టీల మేనిఫెస్టోలపై ప్రత్యేకంగా చర్చిద్దాం. ఈ పదేళ్లు మీరేం చేశారు. ఈ 60 రోజుల్లో మేం ఏం చేశామో చర్చిద్దాం. సభలో తీర్మానం ప్రవేశపెట్టింది మేమే’ అని సీఎం స్పష్టం చేశారు.
మరిన్ని చూడండి