తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కీలకంగా వ్యవహరించే సోషల్ మీడియా వేదికలుగా ఒక పార్టీని మరో పార్టీ దిగజార్చే విధంగా పోస్టులు పెడుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీలను ఎద్దేవా చేస్తూ ప్రచారం మొదలు పెట్టింది.
ముందు నుంచి బీఆర్ఎస్ – బీజేపీ రెండు పార్టీలు ఒకటే అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ గెలవాలని పరోక్షంగా బీజేపీ సాయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అందుకే కాస్త దూకుడుగా వ్యవహరించే బండి సంజయ్ ను తప్పించి, బీఆర్ఎస్ కు మేలు చేసేందుకు సైలెంట్ గా ఉండే కిషన్ రెడ్డిని నియమించారని కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. పైగా కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కోగా, ఈడీ విచారణతో జరిగిన హడావుడి అంతా బీజేపీ వల్లే తగ్గిపోయిందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ వస్తుంది.
తాజాగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటే అనే ప్రచారాన్ని మరింత వినూత్నంగా ముందుకు తీసుకువెళ్తోంది. ‘ప్రేమలో బీఆర్ఎస్ – బీజేపీ’ అంటూ వెడ్డింగ్ కార్డులను ముద్రించి పంచుతూ ఉంది. కార్డు లోపల లగ్గం వేడుక అని.. రాజకీయ బాగోతమేసే వారి ఇంట ఉంటుందని ప్రచురించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో లగ్గం ఉంటుందని ఎద్దేవా చేస్తూ ప్రచురించారు.
అర్చుకునేటోళ్లు.. కేటీఆర్, హరీశ్ రావు, కవిత, కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ అని ఆ కార్డులో ఉంది. ‘మా పార్టీ లగ్గంను తెలంగాణ ప్రజలు అందరూ సూడాలే.. నాకు నువ్వు బీఆర్ఎస్, నీకు నేను బీజేపీ, లోపాయికారి ఒప్పందం మాది’ అని వెడ్డింగ్ కార్డులో ప్రచురించారు.
‘బీజేపీ, బీఆర్ఎస్ లగ్గం పిలుపు.. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోషతో.. ముహూర్తం 2023 సార్వత్రిక ఎన్నికల్లో.. బీఆర్ఎస్, బీజేపీల పెండ్లి, నక్షత్రం: కవితపై కరుణ నక్షత్రంలో, పిలిశెటోళ్లు.. మోదీ, కేసీఆర్, తెలంగాణ మంత్రులు’ అని వెడ్డింగ్ కార్డులో ముద్రించారు.
అంతేకాకుండా, ఈ వెడ్డింగ్ కార్డులను తెలంగాణ కాంగ్రెస్ ట్విటర్ అధికారిక ఎక్స్‌లో కూడా పోస్ట్ చేశారు.
ప్రేమలో… బీఆర్ఎస్❤️బీజేపీ.#BRSLovesBJP pic.twitter.com/Y8qBq2j3e4
— Telangana Congress (@INCTelangana) October 25, 2023