Telangana Elections: ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ ఐదు రాష్ట్రాల ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. మరో ఆరు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో.. ఈ అసెంబ్లీ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా పార్టీలన్నీ భావిస్తున్నాయి. ఈ ఎన్నికల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై తప్పనిసరిగా ఉంటుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిస్తున్నాయి. దీంతో ఎన్నికలు జరుగుతున్ను రాష్ట్రాల్లోని పార్టీలన్నీ అసెంబ్లీ పోరులో గెలుపొందేందుకు ప్రయత్నాలు చేస్తోన్నాయి. ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయని చెప్పవచ్చు. జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు మరింత కీలకంగా మారాయి.

పోటాపోటీగా జరుగుతున్న ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. నగదు కట్టడిని అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తనిఖీలలో పట్టుబడిన నగదు, కానుకలకు సంబంధించి ఈసీ కీలక ప్రకటన చేసింది. తనిఖీలలో పట్టుబడే నగదు, కానుకల విలువను అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్లు ఖరారు అయిన తర్వాత అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో కలపాలని, వారి ఖాతాకు జమ చేయాలని సూచనలు చేసింది.

బుధవారం తెలంగాణ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల అధికారుల ప్రత్యేక బృందం రాష్ట్రానికి చేరుకుంది. ఇవాళ ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న స్పెషల్ టీమ్.. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉండి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించనుంది. ఏర్పాట్ల గురించి వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక బృందం సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ బృందంలో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు నితీష్ వ్యాస్, ధర్మేంద్రశర్మ ఉన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌తో సమావేశం అయ్యారు. ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్దత గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్, ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు.

అలాగే బుధవారం రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌తో పాటు సీఎస్ శాంతికుమారితో సీఈసీ అధికారులు భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలతో పాటు శాంతిభద్రతలు, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారం గురించి చర్చించారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధికారులకు సీఈసీ స్పెషల్ టీమ్ పలు కీలక సూచనలు చేసింది. తనిఖీలను ముమ్మరం చేయాలని, ఎక్కడికక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేయాలని సూచించింది. తనిఖీలు, నిఘాను మరింత పెంచాల్సిన అవసరముందని సూచించారు. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల అధికారులతో కూడా సీఈసీ అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తనిఖీల, నగదు స్వాధీనాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంత నగదు పట్టుబడిందనే వివరాలను ఆరా తీశారు. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండటంతో.. నగదు పంపిణీ మరింత పెరిగే అవకాశముందని ఈసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈసీ అధికారులు మరింత నిఘాను పెంచాలని చూస్తున్నారు. ఎక్కడిక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి తనిఖీలు చేయనున్నారని తెలుస్తోంది.

Source link
previous post
next post