Telangana High Court Comments On Police: పోలీసుల (Telangana Police)పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలీసులు తమ ప్రవర్తనాశైలిని మార్చుకోవాలని హితవు పలికింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిని భయాందోళనకు గురిచేసేలా వ్యవహరించవద్దని సూచించింది. ప్రజల కోసమే పోలీసులు పని చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని.. ప్రజలు పోలీస్ స్టేషన్‌కు సరదాగా రారన్న విషయం తెలుసుకోవాలని స్పష్టం చేసింది.
ఆన్‌లైన్ తరగతులు నిర్వహించండి!
ప్రజలతో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం.. న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చే వారితో అనుచితంగా ప్రవర్తించొద్దని హితవు పలికింది. అవసరమైతే పోలీసులకు ఆన్‌లైన్ విధానంలోనైనా అవగాహన తరగతులు నిర్వహించాలని డీజీపీని ఆదేశించింది. పోలీసుల విధులేంటి? ప్రజలతో ఎలా ప్రవర్తించాలి? స్టేషన్‌కు వచ్చిన వారితో ఎలా నడుచుకోవాలో వివరిస్తూ ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని.. ఈ విషయాన్ని డీజీపీకి తెలియజేయాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌కు సూచించింది.
భవిష్యత్తులో ఎవరూ కోర్టుకు రాకూడదు!
కాలం మారుతున్నా ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు, న్యాయవాదులు, వైద్యుల వద్దకు ప్రజలు విధిలేకే వస్తారన్న విషయం గుర్తుంచుకోవాలని, వారితో స్నేహపూర్వకంగా నడుచుకోవాలని సూచించింది. భవిష్యత్‌లో ఏ ఫిర్యాదుదారుడు తమ కేసు తీసుకోవడం లేదంటూ కోర్టుకు రాకుండా చర్యలు చేపట్టాలని డీజీపీని ఆదేశించింది.
ఏమైందంటే?
ఇటీవల కరీంనగర్ సిటీలో ఓ మహిళను ఓ వ్యక్తి వేధించాడు. దీనిపై ఆమె టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అక్కడ పోలీసులు స్పందించకపోవడంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. తనపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై ఫిర్యాదు చేసినా కరీంనగర్ టూటౌన్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం లేదంటూ బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. కరీంనగర్ టూటౌన్ ఎస్‌హెచ్‌ఓను శుక్రవారం వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించడంతో ఆయన హాజరయ్యారు.
ఎస్‌హెచ్‌ఓ వివరణ ఇవ్వాల్సిందే!
బాధితురాలు ఫిర్యాదు మేరకు 14న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఏఏజీ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ కోర్టుకు తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యానికి క్షమాపణ కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఎస్‌హెచ్‌ఓ మాత్రం జాప్యంపై వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓ మహిళ స్టేషన్‌లో ఉంటే ఎందుకు వచ్చారో కనుక్కోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వ్యాఖ్యానించింది. స్టేషన్‌కు ఎవరూ సరదాగా రారన్న విషయాన్ని గ్రహించాలని హితవు పలికింది.
డీజీపీకి కీలక సూచనలు
బాధితుల వివరాల మేరకు తొలుత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, అంతేకాని తప్పుడు ఫిర్యాదుగా నిర్ధారణకు రావొద్దని పోలీసులకు సూచించింది. మనమంతా చట్టానికి బద్ధులమై పని చేస్తున్నామని, అందరూ దానికి కట్టుబడి ఉండాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు సేవలు అందించేలా స్టేషన్లలో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని డీజీపీకి సూచించింది. అలాగూ ఎస్‌హెచ్‌ఓ వివరణ కోసం విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది. ఆలోగా ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యానికి కారణాలను తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
మరిన్ని చూడండి