KTR Counter PM Modi:
మహబూబ్ నగర్ లో నిర్వహించిన ప్రజా గర్జన సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. నమో అంటే నమ్మించి మోసం చేయడం అని తెలంగాణ ప్రజలకు తెలుసు అని, అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్ ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రైతు బంధు ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. నిజంగా మీరు ప్రధాని అయితే వెంటనే మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని మోదీని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ అంటే రాష్ట్ర ప్రజలకు నమ్మకం అని, అందువల్లే రెండు పర్యాయాలు ఆయనను గెలిపించుకున్నారని .. ఇది చూసి ఓవర్వలేక ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి డ్రామాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మార్పు కోరుకుంటోంది తెలంగాణ ప్రజలు కాదు.. జాతీయస్థాయిలో అధికార మార్పు కావాలని కోరుతోంది దేశ ప్రజలు అని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ కేసీఆర్ చేతిలోనే పదిలంగా ఉందని, కానీ బీజేపీ స్టీరింగ్ అదాని చేతిలోకి వెళ్లిపోయిందంటూ ఎద్దేవా చేశారు.
రైతుల గురించి, వారి శ్రేయస్సు గురించి మాట్లాడే నైతిక అర్హత ప్రధాని మోదీకి లేదన్నారు. మీరు కిసాన్ సమాన్ కింద ఇచ్చింది కేవలం నామమాత్రం… కానీ చిన్న రాష్ట్రమైన తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ 70 లక్షల మంది రైతులకు 72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిన విషయం తెలుసుకుంటే మంచిదని ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ హితవు పలికారు. రైతులకు రుణమాఫీ జరగనే లేదని మాట్లాడటం మిలియన్ డాలర్ జోక్ అన్నారు. కొత్త రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోగా, జరుగుతున్న అభివృద్ధిని మోదీ సహా బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని పలుమార్లు బీఆర్ఎస్ నేతలు అన్నారు.
ఒక కొత్త రాష్ట్రం రెండుసార్లు రైతుల రుణమాఫీకి నడుం బిగించిన ఏకైక సందర్భం తెలంగాణలోనే ఆవిష్కృతమైందని, స్వతంత్ర భారత చరిత్రలోనే ఇది తొలిసారి అన్నారు. అన్నదాత అప్పులు మాఫీ చేసిన జైకిసాన్ ప్రభుత్వం మాది. కార్పొరేట్ దోస్తులకు 14.5 లక్షల కోట్ల రుణాలను రద్దుచేసిన.. నై కిసాన్ సర్కారు మీదంటూ మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విభజన హామీలను పదేళ్లపాటు పాతరేసి మీ ఎన్నికల హామీలను గాలికి వదిలేసి ఓట్ల వేటలో ఇప్పుడొచ్చి మాట్లాడితే నమ్మేదెవరు అని ప్రశ్నించారు.
ప్రాజెక్టులు వల్ల చుక్క నీరు రాలేదనడం మీ అవివేకానికి నిదర్శనం. తెలంగాణలో సాగుతోంది సాగునీటి విప్లవం కొనసాగుతోందన్నారు. తెలంగాణ రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన మీరు మా గురించి మాట్లాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనమంటే నూకలు తినమన్న మీ కేంద్ర పెద్దల మాటలు తెలంగాణ రైతులు మరిచిపోలేదన్నారు. నిన్న కాళేశ్వరం అయినా.. నేడు పాలమూరు ప్రాజెక్టు అయినా ప్రపంచ సాగునీటి చరిత్రలోనే అతి గొప్ప మానవ నిర్మిత అద్భుతాలు. వీటిపై మీ ఆరోపణలు.. పూర్తిగా అవాస్తవాలు అని కేటీఆర్ ట్విట్టర్ (X)లో పోస్ట్ చేశారు.