Telangana Congress: తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా కొనసాగుతున్నాయి. రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. అసెంబ్లీలో పార్టీల బలాబలాలను బట్టి అధికార కాంగ్రెస్‌కు రెండు, ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు ఒక స్థానం దక్కనుంది. కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఒకరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. మూడు స్థానాలకు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. కాంగ్రెస్ మూడో స్థానానికి కూడా అభ్యర్థిని పోటీలోకి దింపుతుందనే ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో ఎలాంటి ఉత్కంఠ లేకుండానే రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.
తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, యువనేత అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) రాజ్యసభ ఎన్నికల్లో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నిక ఏకగ్రీవం కావడంతో వారిద్దరూ రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అందరికీ సుపరిచితురాలే. కానీ యువనేత అనిల్ కుమార్ యాదవ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్తుండటంతో యువ నేత గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకు అనిల్ కుమార్ యాదవ్ ఎవరో కాదు.. సికింద్రాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ కుమారుడే అనిల్ కుమార్ యాదవ్. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ చదివిన అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav).. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
అలాగే తెలంగాణ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడిగా, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2018 ఎన్నికల్లో ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ విజయం సాధించారు. పరాజయం పాలైనా అనిల్ కుమార్ యాదవ్ సైలెంట్‌గా ఉండలేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నేతలందరితో సత్సంబంధాలు కొనసాగించారు. సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించేవారు. ఎలాంటి వివాదాలకు పోకుండా నేతలందరితో సన్నిహితంగా ఉండేవారు. ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపుతుందనే ప్రచారం కూడా జరిగింది. కానీ అనూహ్యంగా ఆయనకు రాజ్యసభ టికెట్ కేటాయించారు. ఒక యువ నాయకుడికి రాజ్యసభ సీటు ఇవ్వడం కాంగ్రెస్ నేతలనే కాకుండా రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
టీ కాంగ్రెస్‌లో ఎంతోమంది తలపండిన నేతలు ఉన్నారు. వారిని పక్కనపెట్టి యువకుడికి టికెట్ ఇవ్వడం గమనార్హం. కాగా రాజ్యసభ టికెట్ దక్కడంపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తనకు సీటు వస్తుందని తాను అసలు ఊహించలేదని, యువకుడినైన తాను పెద్దల సభకు వెళుతుండటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కాంగ్రెస్‌లో కష్టపడేవారికి పదవులు దక్కుతాయని, తానే ఉదాహరణ అంటూ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
మరిన్ని చూడండి