Two Foreigners Arrested Who Cheating With Fake Currency: తెలంగాణ పోలీసులు ఫేక్ కరెన్సీ (Fake Currency) ముఠా గుట్టు రట్టు చేశారు. నకిలీ నోట్లతో ప్రజలను మోసగిస్తోన్న ఇద్దరు విదేశీయులను బుధవారం మల్కాజిగిరి ఎస్ వోటీ అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు (Sudheer Babu) వెల్లడించారు. నిందితులు ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో రూ.లక్షకు రూ.5 లక్షలు ఇస్తామని ఆశ కల్పిస్తారని చెప్పారు. బాధితుల నుంచి డబ్బు తీసుకున్నాక వారిపై మత్తు మందు చల్లి పారిపోతారని అన్నారు. ప్రధాన నిందితులైన కోంబి ఫ్రాంక్, గోయిట సొంగాలు కామెరాన్, మాలి దేశాలకు చెందిన వారని పేర్కొన్నారు. వీరి వీసా గడువు ముగిసినా.. వారి దేశాలకు వెళ్లకుండా నకిలీ కరెన్సీతో మోసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని వివరించారు. బోడుప్పల్ వాసి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని సీపీ తెలిపారు. పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ముఠాలో మరో నిందితుడు పరారీలో ఉన్నాడని.. ఇద్దరు నిందితుల నుంచి రూ.25 లక్షల నకిలీ నోట్లతో పాటు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దీని వెనుక ఇంకా ఎంత మంది ఉన్నారో పూర్తి స్థాయి విచారణ అనంతరం తెలుస్తుందని అన్నారు.
మోసం బయట పడిందిలా
బోడుప్పల్ వాసి అయిన బాధితుడికి ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా నోటిఫికేషన్ వచ్చింది. ‘వెరిఫైడ్ క్లోన్ క్రెడిట్’ అనే గ్రూపులో చేరి చాటింగ్ చేయడం ప్రారంభించాడు. అందులోని ఓ వ్యక్తి తన వద్ద నల్ల కరెన్సీ నోట్లు ఉన్నాయని.. అవి రసాయన ద్రావణంలో ముంచితే అసలు కరెన్సీగా మారుతాయని నమ్మబలికాడు. దీనికి సంబంధించి డెమో కూడా ఇచ్చారు. దీంతో బాధితుడు వారిని నమ్మి రూ.5 లక్షలు ఇచ్చాడు. వారు బదులుగా రూ.25 లక్షల నల్ల కరెన్సీతో పాటు కొన్ని రసాయన పదార్థాలను ఓ పాలిథిన్ కవర్ లో పెట్టి ఇచ్చారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి ప్రయత్నించగా అవి అసలు కరెన్సీగా మారలేదు. దీంతో మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. విచారించిన ఎస్వోటీ పోలీసులు నిందితులైన విదేశీయులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.
Also Read: Mint Compound Fire Accident: మింట్ కాంపౌండ్ లో అగ్ని ప్రమాదం – కాలి బూడిదైన ముద్రణా యంత్రాలు