సిద్ధమవుతున్న టీడీపీ, జనసేన రెండో జాబితా.. ఆశల్లో ఆశావహులు..
టీడీపీ, జనసేన పార్టీలు రెండో జాబితాపై ఫోకస్ పెట్టాయి. నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత వపన్ కల్యాణ్ వెళ్లారు. ఈ క్రమంలోనే పలు విషయాలపై ఇరువురు నేతలు చర్చించుకునే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్‌లు ఇప్పటికే సీట్ల విషయమై ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు.. తమ కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో గత రాత్రి భేటీ అయ్యి అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. రెండో జాబితాలో తెలుగుదేశం 25 నుంచి 30 సీట్లు.. జనసేన 10 సీట్లు వరకూ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే రెండో జాబితా విడుదల అనేది ఇప్పుడే జరుగుతుందా? లేదంటే పవన్ హస్తిన పర్యటన తర్వాత ఉంటుందా? అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.
జనసేన ఖాతాలో రాజోలు..
రెండో జాబితా కోసం టీడీపీ, జనసేనల్లో చాలా మంది ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలి జాబితాలో జనసేన కేవలం ఐదుగురిని మాత్రమే ప్రకటించగా.. టీడీపీ 94 మందిని ప్రకటించింది. మొత్తంగా జనసేన 24 సీట్లను తీసుకుంది. ఇప్పటికే రాజోలు జనసేన ఖాతాలో పడిపోగా ఇంకా 18 సీట్ల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఆ 18 స్థానాలు ఏవి జనసేనకు పోతాయా? అని టీడీపీ నేతలు ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. అయితే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే జనసేనేమిగిలిన సీట్లు ఉంటాయని టాక్. ఆ స్థానాలేంటనే దానిపై టీడీపీ, జనసేనల్లో ఆసక్తి నెలకొంది. ఇక రెండో జాబితాలో శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో శ్రీకాకుళంతో పాటు నరన్నపేట, పలాస, పాతపట్నం అభ్యర్థులను ఫిక్స్ చేయాల్సి ఉంది.
ఏ స్థానం ఎవరికో..
విజయనగరం పార్లమెంట్‌లో ఎచ్చెర్ల, చీపురుపల్లి.. అరకు పార్లమెంటు స్థానంలో పాడేరు, పాలకొండ, రంపచోడవరం స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. విశాఖ పార్లమెంట్ పరిధిలో భీమిలి, గాజువాక, ఎస్.కోట, విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం స్థానాలకు అభ్యర్థులు తేలాల్సి ఉంది. ఇక అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో చోడవరం, ఎలమంచిలి, మాడుగుల, పెందుర్తి అభ్యర్థులను ఫిక్స్ చేయాల్సి ఉంది. ఇక ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల విషయానికొస్తే కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాకినాడ, పిఠాపురం, పత్తిపాడు.. అమలాపురం పార్లమెంట్ పరిధిలో అమలాపురం, రంపచోడవరం, రాజోలు(జనసేనకు ఫిక్స్).. రాజమండ్రి పార్లమెంట్‌లో రాజమండ్రి రూరల్, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం.. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలో అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇక వీటిలో ఏ స్థానం ఏ పార్టీకి పోతుందో చూడాలి.