లెజెండ్ సినిమాకి ముందు జగపతి బాబు పనైపోయింది అన్నవారే.. ఇప్పుడు జగపతి బాబు కి ఏంట్రా ఆయన చేతిలో స్టార్ హీరోల సినిమాలున్నాయి అంటూ కామెంట్స్ చెయ్యడం వలన నాకొచ్చే అవకాశాలు కూడా చేజారిపోతున్నాయ్ అంటూ జగపతి బాబు రీసెంట్ గా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆయన లెజెండ్ 10 ఇయర్స్ సెలెబ్రేషన్స్ పై మాట్లాడుతూ.. లెజెండ్ సినిమా నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని తెలిపారు. ఈ సినిమాకు ముందు నా చేతిలో ఒక్క సినిమా కానీ, నా దగ్గర డబ్బు కానీ లేదు.
ఎవరైనా నాకు సినిమా అవకాశం కల్పిస్తే చాలు అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో లెజెండ్ అవకాశం వచ్చింది. కాకపోతే నేను అసలు విలన్ గా నటిస్తానా లేదా అని బోయపాటి సందేహ పడ్డాడు, కానీ నేను మాత్రం ఆలోచించకుండా సినిమాను ఓకే చేశాను. లెజెండ్ బ్లాక్ బస్టర్ తర్వాత నాకు విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. ఆ ఊపులో దాదాపు ఒక వంద సినిమాలు చేశాను, కానీ అవన్నీ చెత్త సినిమాలే. అవగాహన లేకుండా ఒప్పుకున్న సినిమాలవి. ఇక నాకు చిన్న సినిమాల్లో నటించాలని ఉంది. కమిటెడ్ గా చేస్తున్నారు, అవి కొత్తగా ఉంటున్నాయి.
కానీ నా బ్యాడ్ లక్ ఏమిటంటే నేను డబ్బున్న పేదోడిని. నేను పెద్ద సినిమాల్లో చేస్తున్నా ఒప్పుకుంటాను. కానీ అవి షూటింగ్స్ వాయిదా పడడంతో, లేదా మారేదన్నా కారణమో కాని అనుకున్న సమయానికి విడుదలవ్వవు. అవి చేతిలో ఉన్నాయి కదా అని వేరే వాళ్ళు అవకాశాలు ఇవ్వరు, మరోపక్క ఆయన పెద్ద సినిమాల్లో చేస్తున్నారు, ఎక్కువ పారితోషకం డిమాండ్ చేస్తారేమో అనే భయం చాలామందిలో కనబడుతుంది.
కానీ భారీ బడ్జెట్ సినిమాల వాయిదాల వలన నేను కొన్ని సినిమాల్లో నటించలేకపోతున్నాను. అవకాశాలు కూడా రావడం లేదు. అటు ఇటు కాకుండా పోతున్నాను. అప్పుడప్పుడు నా పని అయ్యిపోయింది అని నేనే అనుకుంటాను. లెజెండ్ కి ముందు కూడా అంతే జగపతి బాబు పనైపోయింది అనుకున్నారు. కానీ మళ్ళీ వచ్చా. వస్తూనే ఉంటాను, వెళుతూనే ఉంటాను అంటూ జగపతి బాబు తన కెరీర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.