TSRTC Good News For Devotees: శ్రీశైలం (Srisailam) మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు TSRTC గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకునే వారికి వాటితో పాటే శ్రీశైలం ఆలయంలో దర్శన టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రతి రోజూ 1200 టికెట్లు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 200 స్పర్శ దర్శనం, 500 అతి శ్రీఘ్రదర్శనం, మరో 500 శీఘ్రదర్శనం టికెట్లు ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు ఆర్టీసీ, శ్రీశైలం దేవస్థానం మధ్య ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారు. స్పర్శదర్శనం టికెట్ ధర రూ.500, అతి శీఘ్రదర్శనం రూ.300, శీఘ్రదర్శనం టికెట్ ధర రూ.150 ఉంటుందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ విధానం అమల్లోకి తీసుకు రానున్నట్లు స్పష్టం చేశారు.
50 నిమిషాలకో ఏసీ బస్సు
హైదరాబాద్ (Hyderabad) నుంచి శ్రీశైలం (Srisailam) వరకూ ఇప్పటివరకూ నాన్ ఏసీ బస్సులు ఉండగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి ఏసీ బస్సులను ప్రారంభించారు. ఈ సర్వీసులు వారం రోజుల్లోగా ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. వీటి ఛార్జీలను పెద్దలకు జేబీఎస్ నుంచి రూ.750, పిల్లలకు రూ.540, ఎంజీబీఎస్ నుంచి అయితే పెద్దలకు రూ.700, పిల్లలకు రూ.510గా నిర్ణయించినట్లు చెప్పారు. హైదరాబాద్ – శ్రీశైలానికి ప్రతి 50 నిమిషాలకు ఓ ఏసీ బస్సు, ప్రతి 20 నిమిషాలకు ఓ సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ఆర్ఎం శ్రీధర్ తెలిపారు.
100 బస్సులు ప్రారంభించిన సీఎం
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శనివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద 100 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆరు గ్యారెంటీల్లో మొట్ట మొదటి హామీ అమలు చేసిన ఘనత ఆర్టీసీ కార్మికులదేనని సీఎం రేవంత్ ఈ సందర్భంగా అన్నారు. ఇప్పటివరకూ 15.21 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని, ఇందు కోసం ఆర్టీసీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.535 కోట్లు విడుదల చేశారని వివరించారు. మరో 1,300 బస్సులు కొనాలని సంస్థ కోరిందని.. అందుకు సర్కారు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రారంభించిన కొత్త బస్సుల్లో 90 సర్వీసులు ‘మహాలక్ష్మి’ పథకం కింద తిప్పుతామని, మరో 10 ఏసీ బస్సులు హైదరాబాద్ – శ్రీశైలం మార్గంలో నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
Also Read: Weather Latest Update: నేడు కాస్త ఎక్కువగానే ఎండలు, హైదరాబాద్ లో ఇలా!
మరిన్ని చూడండి