దిశ, ఫీచర్స్ : ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం.. ఇలా కాలం మారుతూనే ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతా 2024 సంవత్సరంలో ఉంది. కానీ ఒక దేశంలోని ప్రజలు మాత్రం ఇంకా 2016 సంవత్సరంలోనే ఉన్నారు. సెప్టెంబర్ నెలవస్తే 2017 సంవత్సరంలోకి అడుగు పెడతారట. ఇంతకీ ఆ దేశమేది? అనుకుంటున్నారా.. ఇథియోపియా.
వరల్డ్ వైడ్‌గా అన్ని దేశాల్లోనూ జనవరి ఫస్టునే న్యూ ఇయర్‌కు వెల్కం చెప్తారు. దీనిని ఒక వేడుకగా జరుపుకుంటారు. కొత్త సంవత్సరాన్ని ఎవరు ఎలా ఎంజాయ్ చేస్తారనేది పక్కన పెడితే క్యాలెండర్ మాత్రం దాదాపు అన్ని దేశాల ప్రజలకు ఒకే విధంగా ఉంటుంది. కానీ తూర్పు ఆఫ్రికాలో గల ఒక్క ఇథియోపియా (Ethiopia) క్యాలెండర్ మాత్రం మిగతా ప్రపంచానికి భిన్నంగా ఉంటుంది. న్యూ ఇయర్ వేడుకలు కూడా అలాగే జరుగుతాయి.
సెప్టెంబర్‌లో న్యూ ఇయర్
మిగతా దేశాల్లో సెప్టెంబర్‌లో.. అంటే సంవత్సరంలో 9వ నెల ఉన్నప్పుడు, ఇథియో పియాలో మాత్రం సంవత్సరంలో మొదటి నెల ప్రారంభం అవుతుంది. అక్కడి ప్రజలు మనం సెప్టెంబర్ ఫస్టుగా భావించే రోజున న్యూ ఇయర్‌కు వెల్కం చెప్తారు. ఈ కారణంగా మిగతా ప్రపంచానికంటే ఏడెనిమిది సంవత్సరాలు తారతమ్యంతో రోజులు వెనుకబడి ఉంటాయి. అందుకే అందరూ 2024లో ఉంటే ఇథియోపియా ప్రజలు ఇప్పుడు 2016లో ఉన్నారు.
సంవత్సరానికి 13 నెలలు
ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఏడాదికి 12 నెలలు ఉంటాయి. ఇథియోపియన్ క్యాలెండర్ జీజ్ ప్రకారం (Ge’ez calendar) ఆ దేశంలో సంవత్సరానికి 13 నెలలు ఉంటాయి. ఇందులో 12 నెలలు ఒక్కో నెలకు 30 రోజుల చొప్పున ఉండగా, పగుమే(Pagume)అని మరో నెల ఎక్స్‌ట్రాగా ఉంటుంది. కాగా ఇథియోపియన్ న్యూ ఇయర్‌ను ఎంకుటటాష్ అని పిలుస్తారు. ఇది ఏటా సెప్టెంబర్ 11న వస్తుంది. ఆ రోజు ప్రజలు న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకుంటారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
ఎందుకని భిన్నంగా ఉంటుంది?
సీఎన్‌ఎన్ రిపోర్ట్ ప్రకారం..1582లో పోప్ గ్రెగరీ XIII గ్రెగోరియన్ అనే వెస్ట్రన్ క్యాలెండర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రపంచమంతా దానిని ఫాలో అయితే ఒక్క ఇథియోపియా ప్రజలు మాత్రం యేసు క్రీస్తు జననం ఏడు లేదా ఎనిమిది సంవత్సరాల తర్వాత జరిగిందని నమ్ముతూ వచ్చారు. ఆ ప్రకారమే ఇథియోపియన్ దేశం కూడా ఆర్థోడాక్స్ చర్చి రూల్స్ ప్రకారం పాత తేదీలనే కొనసాగించాలని భావించిందట. అంటే క్రీస్తు శకం 500 చుట్టూ ఉన్న రోమన్ చర్చి లెక్కలను ఆ దేశం సవరించి సొంత క్యాలెండర్‌ను అనుసరించడం మొదలు పెట్టింది. అయితే ప్రపంచంతో సమయాన్ని పోల్చుకునే క్రమంలో తమ దేశం క్యాలెండర్ భిన్నంగా ఉండటంవల్ల ఇథియోపియన్ ప్రజలు కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి కూడా వస్తోందట.
సమయం కూడా ప్రత్యేకమే
ఇథియోపియాలో క్యాలెండర్ మాత్రమే కాదు, అక్కడి గంటలు, రోజులు వంటి సమయాల్లో కూడా మిగతా ప్రపంచానికి తేడాలు ఉంటాయి. ఒక ప్రత్యేకమైన క్లాక్ సిస్టమ్‌ను ఇథియోపియన్లు ఫాలో అవుతున్నారు. ఇక్కడ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు 12 గంటల గడియార వ్యవస్థనే యూజ్ చేస్తున్నప్పటికీ, మిగతా ప్రపంచం మాదిరి ఇక్కడ మధ్య రాత్రి 12 గంటలకు కాకుండా, ఒంటి గంటకు ప్రారంభం అవుతుంది. ఈ దేశంలో మార్నింగ్ 8 గంటల సమయం అవుతుంటే గనుక.. మిగతా దేశాల్లో ఉదయం 7 గంటలు అవుతుంది.