రుషికొండ.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ వినిపిస్తున్న పేరు.. రాజ్ మహల్ ఫోటోలు ఎక్కడ చూసినా దర్శనం (కనిపిస్తున్న) ఇస్తున్న పరిస్థితి. గత వైఎస్ జగన్ ప్రభుత్వం విశాఖపట్నం వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అత్యాధునిక కట్టడాల భవిత అని వైసీపీ చెబుతుండగా.. ఇదే నిజమైతే లోపల బాత్ రూమ్, బెడ్ రూమ్ చూసిన తర్వాత అందరికీ అనుమానం వచ్చింది. పోనీ ఇదేమైనా జగన్ రెడ్డికి తిరిగి ఇచ్చేస్తారా అంటే అది అస్సలు కాదు.. కుదరదు కూడా. అందుకే ఇప్పుడు ఈ రాజ్ మహల్ సంగతి ఏంటి..? ఏం చేస్తే బెస్ట్..? ఎలా వాడుకోవచ్చు..? దేనికోసం..? అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇలా వాడుకోవచ్చు..?
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు లేదా విడిదికి ప్రధాని, రాష్ట్రపతి వచ్చినా కనీస సౌకర్యాలు, బస చేసేందుకు ఒక్కటంటే ఒక్కటీ ప్రభుత్వ భవనం లేదు. అంతే కాదు గవర్నర్, ఇతర ప్రముఖులు ఉండేందుకు సరైనా సౌకర్యాలు ఉండే పరిస్థితి ఎక్కడా లేదు. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి వచ్చినప్పుడు బస చేసేందుకు ఐనా ఏమైనా ఉందా అంటే అబ్బే అస్సలు లేదు. అందుకే ఈ రుషికొండలోని ఈ పెద్ద భవనాన్ని ప్రభుత్వం అధికార నివాస గృహంగా వినియోగిస్తే మంచిదని.. దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ లకు రాజకీయ విశ్లేషకులు, మేధావులు చెబుతున్న మాట. ఎందుకంటే.. ఇలాంటి అందమైన, అద్భుతమైన ప్రభుత్వ కట్టడాలు ఆంధ్రాలో మరెక్కడా లేవు.. భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. దీనికి తోడు.. రాష్ట్రం కూడా తీవ్ర అర్ధిక కష్టాల్లో ఉండటం.. రూ. 500కోట్లతో ప్రభుత్వ బిల్డింగ్ ఎలా కడతారు? ప్రజాధనం దుబారా అంటూ కొందరు పెద్దలు చెబుతున్నారు సరే. అసలే.. జీతాలకే డబ్బులు లేని రాష్ట్రంలో లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతి ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారు? అనేది కూడా పెద్ద సందేహమే. పోనీ ఇప్పుడు జగన్ చేసింది ప్రజా ధనమే ఐతే.. రేపు పొద్దున్న అమరావతి గ్రామాల్లో ఖర్చు చేస్తే ప్రపంచ ప్రయోజనాలు కోసమా? అనేది ఎవరికి తెలియట్లేదు. ఇదొక్కటే కాదు సగటు వ్యక్తికి అర్ధం కాని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయ్.
వైసీపీ ఏం చెబుతోంది..?
రుషికొండలో అది కూడా పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా..? విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా..? అని వైసీపీ ప్రశ్నిస్తోంది. పోనీ వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా..? అనేది కూడా ప్రశ్న వస్తోంది. 2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రుషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా..? 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టాం… ఇందులో అక్రమం ఎక్కడుంది..? అని గత పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకూ చంద్రబాబు, పవన్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. వీళ్ళు రెస్పాండ్ ఐతే బాగుంటుంది.. ఇక ఫైనల్ గా కొండపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి