రాములమ్మ.. ఓ.. రాములమ్మ.. ఓహో రాములమ్మ.. ఎక్కడున్నావమ్మా.. ఏమైపోయావమ్మా..!! నీ ఆచూకీ లేదేమ్మా..!!
ఇప్పుడిదే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ. మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అలియాస్ రాములక్క అడ్రస్ లేరు.! కోరుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ ఎక్కడా పలుకూ లేదు ఉలుకూ లేదు!. మేడంను హస్తం పార్టీ పట్టించుకోలేదా..? పార్టీకి రాములమ్మ అక్కర్లేదా..? ఏం జరుగుతోంది.. ఏం కథ..!!
ఏమైందమ్మా..!!
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రాములమ్మ స్టయిలే వేరు. మీడియా ముందుకొచ్చినా.. సభల్లో మాట్లాడినా కథే వేరుగా ఉంటది. సొంతంగా పార్టీ పెట్టినా, కారులో ఉన్నా.. కమలంలో ఉన్నా.. ఆఖరికి కాంగ్రెస్ లో ఉన్నా రాములమ్మ రేంజ్ వేరు. అటు తిరిగి.. ఇటు తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చిన ఈమె అధికారంలోకి ఉన్నా ఎక్కడా జాడే లేదు. వాస్తవానికి అధికారంలోకి రాగానే ఏదో ఒక కీలక పదవి కట్టబెడతారని గట్టిగానే టాక్ నడిచింది కానీ.. కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్ పదవికే పరిమితం అయ్యారు. పైగా ఎక్కడా మీడియా ముందు కూడా.. కనిపించట్లేదు. దీంతో రాములమ్మ ఏమైపోయారో అభిమానులకే అర్థం కానీ పరిస్థితి.
పట్టించుకోరేం!
బీజేపీలో ఉన్నప్పుడు కారు, కాంగ్రెస్ పార్టీలను ఓ ఆటడుకున్నారు విజయశాంతి. కమలం వాడిపోయే పరిస్థితి ఉన్నప్పుడే బయటికొచ్చి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు.. పోనీ ఎంపీగా ఐనా పోటీ చేస్తారు అనుకుంటే అబ్బే అదీ లేదు. కనీసం నామినేటెడ్ పదవి ఐనా వస్తుందేమో అనుకుంటే ఆ ఊసే లేదు. మెదక్ ఎంపీగా పని చేసిన విజయశాంతికి ఈ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి ఉంటే ఈజీగా గెలిచేవారు. పైగా అధికారంలో పార్టీ అండి కనుక ఇంకా ఈజీ అయ్యేది.. కానీ కాంగ్రెస్ ఎందుకో అలాంటి ప్రయత్నం చేయట్లేదు.
జర ఇటు చూడుర్రి!
ఇన్నాళ్లు ఏదో ఇస్తారని వేచి చూసిన ఆమె.. ఇకనైనా నోరు తెరిచి అడిగితే తప్పేం లేదు కదా.. ఎంత సేపూ సోషల్ మీడియాకే పరిమితం కాకుండా మీడియా గొట్టాల ముందుకు కూడా వస్తె మరీ మంచిది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎవరెవరికో పదవులు దక్కాయి. అలాంటిది రాములమ్మకు ఏమీ ఇవ్వలేదు. ఇకనైనా ఢిల్లీలోని అగ్ర నాయకత్వం, రాష్ట్రంలోని నేతలు కాస్త శాంతంగా ఉన్న విజయశాంతినీ పట్టించుకుంటే మంచిది.