పురందేశ్వరి ఏంటి పొత్తుపై ఇంత పెద్ద షాకిచ్చారు?
ఏపీలో పొత్తుల విషయం డైలీ సీరియల్ మాదిరిగా సాగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు హస్తినకు వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. పొత్తుల అంశంపై అప్పుడే క్లారీ వస్తుందని అంతా భావించారు. కానీ అది రాలేదు. ఇక అప్పటి నుంచి నేడో.. రేపో అంటూ పొత్తులు ఫిక్స్ అంటూ ఊహాగానాలు వినవస్తున్నాయి. రోజులు గడుస్తున్నాయి కానీ ఆ ప్రకటన రాదే. ఇటు చూస్తేనేమో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ కూడా పొత్తులో చేరుతుందని అంటున్నారు. కాబట్టి ఆ పార్టీ కోసం కొన్ని సీట్లను తాను త్యాగం చేశానని కూడా చెబుతున్నారు. బీజేపీ, జనసేన రెండు పార్టీలూ ఎప్పటి నుంచో పొత్తులో ఉన్నాయి కాబట్టి పవన్‌కి తెలియనిది ఏముంటుందని అంతా అనుకున్నారు.
బీజేపీతో పొత్తు ఇరు పార్టీల నేతలకూ ఇష్టం లేదు..
టీడీపీ కూడా కొన్ని సీట్లను బీజేపీ కోసం హోల్డ్‌లో పెట్టి ఆశగా బీజేపీ రాక కోసం ఎదురు చూస్తోంది. ఇక మెజారిటీ కేడర్, టీడీపీ, జనసేన నేతలు అయితే బీజేపీ పొత్తులోకి రాకుంటేనే బావుంటుందని అనుకుంటున్నారు. ఏమాత్రం సత్తా లేని బీజేపీకి పెద్ద మొత్తంలో సీట్లు కట్టబెట్టడం ఇరు పార్టీల నేతలకూ ఇష్టం లేదు. కానీ అధినేత నిర్ణయాన్ని గౌరవించి సైలెంట్‌గా ఉంటున్నారు. పక్కాగా నేడో, రేపో బీజేపీ నుంచి పొత్తు ప్రకటన వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి షాక్ ఇచ్చారు. ఆమె ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నట్టుగా వెల్లడించారు. నిజానికి బీజేపీ పొత్తు ప్రకటన వస్తుందని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న పార్టీలకు ఇది కొంత ఇబ్బందికర పరిణామమే.
ఇంతకీ పురందేశ్వరి ఏమన్నారంటే..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చే సే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ అన్ని స్థానాల్లో పోటీ చేసేలా క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నట్లు పురందేశ్వరి చెప్పడమే కాస్త షాకింగ్‌గా మారింది. ఇన్ని రోజులవుతున్నా పొత్తులపై ప్రకటన చేయకపోవడం బీజేపీ నేతలను కూడా గందరగోళంలోకి నెట్టి వేస్తోంది. పైగా అన్ని స్థానాలకు పోటీ చేసేలా అభ్యర్థుల సెర్చింగ్ మరింత విస్మయానికి గురి చేస్తోంది. పురందేశ్వరి అయితే పొత్తులపై కేంద్ర పెద్దలు ప్రకటన చేస్తారని అంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దగ్గుబాటి పురందేశ్వరి భేటీ అయ్యి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఇక చూడాలి ఏం జరుగుతుందో..