Woman Software Engineer Suicide in Athapur: రంగారెడ్డి (RangaReddy) జిల్లా అత్తాపూర్ (Athapur)లో ఆదివారం విషాదం జరిగింది. ప్రియుడి చేతిలో మోసపోయాననే మనస్తాపంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. అత్తాపూర్ కు చెందిన యువతి స్థానికంగా ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తోంది. తన ఫ్లాట్ లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని యువతి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు అతిథి భరద్వాజ్ గా గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యువతి ఓ యువకున్ని ప్రేమించగా.. ఇటీవల సదరు వ్యక్తి ఆమెను దూరం పెట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించి మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
అనారోగ్యంతో మరో వ్యక్తి ఆత్మహత్య
ఓ వ్యక్తి అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వై.లక్ష్మాపురం గ్రామానికి చెందిన అచ్చయ్య (55)కు అనారోగ్యంతో కుటుంబ సభ్యులు పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ నెల 16న చికిత్స నిమిత్తం గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో కుటుంబీకులు చేర్చగా శస్త్రచికిత్స చేశారు. అయితే, సర్జరీ పూర్తైనా అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో మనస్తాపానికి గురైన అచ్చయ్య ఆస్పత్రి స్పెషాలిటీ బ్లాక్ మీద నుంచి దూకాడు. ఈ క్రమంలో సిబ్బంది గమనించి అత్యవసర విభాగంలో చేర్చగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కడుపు నొప్పి భరించలేకే తన తండ్రి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రెండంతస్తుల నుంచి దూకినట్లు మృతుడి కుమారుడు తెలిపాడు.
Also Read: Warangal News: వరంగల్‌లో రోడ్డు ప్రమాదం, ఒకరు దుర్మరణం – పలువురికి గాయాలు