ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలిపోరులో అద్భుత విజయం సాధించిన టీమిండియా.. పాక్‌తో అక్టోబర్‌ 14న హై ఓల్టేజ్ మ్యాచ్‌లోనూ గెలుపొందాలని పట్టుదలగా ఉంది. అయితే పాక్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్లు కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నారనే వార్త సోషల్‌ మీడియాను చుట్టేస్తోంది. ICC 2019 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ తో జరిగిన పోరులో భారత జట్టు నారింజ రంగు జెర్సీలతో బరిలోకి దిగింది. మరోసారి టీమిండియా అలాగే బరిలోకి దిగుతుందని సామాజిక మాధ్యమాల్లో వార్త వైరల్‌గా మారింది. ఈ వార్తలపై బీసీసీఐ కోశాధికారి ఆశిష్ షెలార్ స్పష్టత ఇచ్చారు.

అక్టోబరు 14న పాకిస్థాన్‌తో జరిగే ఐసీసీ ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత్‌ బ్లూ రంగు డ్రెస్‌తో బరిలోకి దిగుతుందని షెలార్ స్పష్టం చేశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ నీలిరంగు జెర్సీలతోనే వాడుతుందని తేల్చి చెప్పారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమ్ ఇండియా వేరే రంగు డ్రెస్‌ ధరిస్తుందన్న వార్తలను షెలార్ ఖండించారు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని తెలిపారు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో యూట్యూబర్ జార్వో అలియాస్ డేనియెల్‌ జార్విస్‌ మైదానంలోకి దూసుకొ రావడంపై కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇండియా జెర్సీ ధరించిన జార్వో చిదంబరం స్టేడియంలో హల్‌చల్‌ చేశాడు. టీమిండియా జెర్సీ ధరించి బౌలింగ్ చేస్తానంటూ రచ్చ చేశాడు. విరాట్ కోహ్లీ సర్ది చెప్పడంతో మైదానాన్ని వీడాడు. జార్వో మామ కారణంగా కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్.. బ్యాటింగ్ ఎంచుకోగా టీమిండియా ఫీల్డింగ్‌కు దిగింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే జార్వో సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. అతని ఎంట్రీతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. జార్వోను బయటకు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అతను వినకపోవడంతో.. విరాట్ కోహ్లీ అతనికి నచ్చజెప్పాడు.

టోర్నీలో తదుపరి మ్యాచ్‌లకు హాజరుకాకుండా జార్వోపై ఐసీసీ నిషేధం విధించింది. VIP ఆటగాళ్లుండే ప్రాంతానికి జార్వో ఎలా వచ్చాడో తెలుసుకునేందుకు అధికారులు విచారణకు ఆదేశించారు. మూడంచెల భద్రతా వ్యవస్థను జార్వో ఎలా ఉల్లంఘించగలడనే ప్రశ్న ఉత్పన్నమైంది.
అహ్మదాబాద్‌ వేదికగా ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌పై అభిమానులు అంతగా ఆసక్తి చూపలేదు. దాదాపు సగం స్టేడియం ఖాళీగానే ఉంది. కానీ భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అనగానే అభిమానులు ఎంత ఖర్చైనా పెట్టి ప్రత్యక్షంగా చూసేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే దాయాదుల పోరు జరిగే అహ్మదాబాద్‌లో విమాన ధరలు, హోటల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం భారత రైల్వే ప్రత్యేకంగా వందే భారత్ రైళ్లు కూడా నడుపుతోంది.

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో మాత్రమే దాయాదులు తలపడుతున్నాయి. ఫలితంగా పాకిస్థాన్‌ జట్టు భారత్‌లో పర్యటించడం లేదు. చివరిసారిగా 2016లో టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు ఇక్కడికి వచ్చిన దాయాది జట్టు మళ్లీ ఏడేళ్ల తర్వాత వన్డే వరల్డ్‌ కప్‌ కోసం భారత్‌లో అడుగుపెట్టింది.

Source link