నెల్లూరు జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీని వీడాలా? వద్దా? అని ఊగిసలాటలో ఉన్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఇక ప్రశాంతిరెడ్డి వచ్చేసి టీటీడీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. ఇక వేమిరెడ్డి దంపతులతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కీలక నేతలు, అనుచరులు పార్టీకి రాజీనామా చేయనున్నారు. అసలే నెల్లూరు జిల్లాలో వైసీపీ ఆక్సిజన్ సపోర్టుతో నడుస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే వెంటిలేటర్‌పైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
పార్టీని వీడనున్న వేమిరెడ్డి..
అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ తరుణంలో ప్రజాప్రతినిధులంతా వైసీపీకి రాజీనామా చేసి వరుసబెట్టి వేరే పార్టీలోకి జంప్ అవుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా బాట పట్టారు. ఇక నెల్లూరు జిల్లాలో అయితే చాలా మంది నేతలు ఇప్పటికే రాజీనామా చేశారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పగా, తాజాగా రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. తొలుత వేమిరెడ్డికి ఎంపీ పదవి ఇస్తాననే చెప్పారు. అయితే నియోజకవర్గ ఇన్‌చార్జుల మార్పుపై వేమిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సీఎం జగన్ తన వద్దకు పిలిచి బుజ్జగించారు. ఇక వేమిరెడ్డి పార్టీ మారరని అంతా ఫిక్స్ అయ్యారు.
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా..
ఈ లోపే నెల్లూరు నగర సమన్వయకర్తగా ఎండీ ఖలీల్‌ను సీఎం జగన్ నియమించారు. అయితే ఈ విషయాన్ని వేమిరెడ్డికి కనీసం తెలియనివ్వ లేదు. అలాగే ఆయనకు వైసీపీ టికెట్ సైతం దక్కే అవకాశం లేదని తెలిసినట్టు సమాచారం. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే వేమిరెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ కానీ లేదంటే రేపు కానీ వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితోపాటు రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయనున్నారని సమాచారం. అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వేమిరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తే వైసీపీకి నెల్లూరు జిల్లాలో పెద్ద దెబ్బే తగలనుంది. పైగా ఆయన వైసీపీకి ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తున్నారు.