Sheetal Devi Inspiration Story: శీతల్ దేవి… భారత పారా అథ్లెట్. దేవుడు తనను లోపంతో పుట్టించినా ఆమె ఏనాడూ బాధపడలేదు. రెండు చేతులూ లేవని సమాజం గేలి చేసినా వెనుదిరిగి చూడలేదు. కటిక పేదరికం వెక్కిరిస్తున్నా ఏ మాత్రం అధైర్యపడలేదు. 17 ఏళ్ల వయసులోనే.. యావత్ దేశమే కాకుండా ప్రపంచం మెచ్చిన క్రీడాకారిణిగా అవతరించి కొన్ని కోట్ల మందికి ప్రేరణగా నిలిచారు. మరి ఎలా తను ఈ ప్రయాణంలోకి వచ్చారు. జీవితంలో నిరాశ నిస్పృహ ఆవహించిన ఎంతో మందికి ఎలా నిజమైన ప్రేరణ ఇచ్చారో తెలియాలంటే ఇది చదవాల్సిందే.
2007 జనవరి 10న కశ్మీర్ లోని కిష్టావర్ జిల్లా లోథియార్ గ్రామంలో మాన్‌సింగ్, శక్తిదేవిలకు జన్మించారు శీతల్ దేవి. ఫోకోమేలియా అనే అరుదైన వ్యాధి కారణంగా ఆమె రెండు చేతులూ లేకుండానే జన్మించింది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబానికి అలా పుట్టిన శీతల్ ని చూసి గుండె తరుక్కుపోయింది. అయినా అల్లారు ముద్దుగా పెంచుకొన్నారు. శీతల్ దేవి ఏ రోజూ తన లోపాన్ని చూసి బాధపడలేదు. అలాగే చెట్లు ఎక్కడం నేర్చుకొంది. తమ దగ్గర ఏ కార్యక్రమం జరిగినా భయపడకుండా వెళ్లేది. కశ్మీర్‌లో అప్పుడు నెలకొన్న పరిస్థితులు దృష్ఠ్యా బయటకు వెళ్తున్న శీతల్‌ని చూసి తల్లిదండ్రులు భయపడినా ఆమె మాత్రం ఏ మాత్రం భయం లేకుండా భారత ఆర్మీ పోస్టుల దగ్గరకు వెళ్లి సైనికులతో మాట్లాడుతూ ఉండేది. అలా 14 ఏళ్ల వయసులో భారత ఆర్మీ అధికారులు చేతులు లేకున్నా కూడా రాయడం, తన పనులు తను చేసుకుంటున్న శీతల్‌దేవిని చూసి ఆశ్చర్యపోయారు. ఆమె ఆసక్తులను తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ శీతల్ బాగోగులు చూడటమే కాకుండా తనకి ఆర్చరీ ఇష్టమని చెప్పడంతో మేఘనా గిరీష్ అనే ఓ N.G.O సాయంతో బెంగళూరులోని శిక్షణా కేంద్రానికి పంపించారు.
శీతల్ ని అలా చూసిన కోచ్ లు కుల్‌దీప్ బైద్వాన్, అభిలాష్ చౌదరి ముందు పెద్ద సవాలే నిలిచింది. ఇలాంటి ఒక అథ్లెట్ కి ఇంతకు ముందెన్నడూ ట్రైనింగ్ ఇవ్వలేదు. కానీ శీతల్ పట్లుదల చూసి కోచ్‌లు ఓ పరిష్కారం వెతికారు. కాళ్లతో బాణాలు వేసే మాట్ స్టట్జ్‌మెన్ గురించి తెలుసుకొని తను ఎలా ప్రాక్టీస్ చేశాడో క్షుణ్ణంగా అధ్యయనం చేసి 11 నెలల కఠిన శిక్షణ ఇచ్చి శీతల్ ని రెడీ చేశారు. శీతల్ చేతులు లేకుండా కాళ్లతో బాణాలు వేయడం చాలా కష్ఠంగా అనిపించినా అంతకు ముందు కాళ్లనే చేతులుగా మలుచుకొన్న శీతల్ బాణాలు వేయడంలో రానురానూ రాటుదేలిపోయింది. ఓ కుర్చీలో కూర్చొని కుడికాలితో బాణాన్ని పట్టుకొని నోటితో వింటినారిని విదల్చడం చూసి కోచ్ లే ఆశ్యర్యపోయారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ఆత్మవిశ్వాసం సాధించేందుకు గానూ చేతులు ఉన్న ఆర్చర్లతో పోటీ పడేది. పోటీపడటమే కాదు గెలిచేది కూడా.
ఇవీ విజయాలు
ఇక, 2022 పారా ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలతో కలిపి మొత్తం 3 పతకాలు సాధించి చరిత్ర సృష్ఠించారు శీతల్. 2023 జులైలో ప్రపంచ పారా ఆర్చెరీ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచింది. కొద్ది తేడాలో బంగారు పతకం కోల్పోయినా రెండో స్థానంలో నిలిచి టోర్నీ జరిగిన చెక్ రిపబ్లిక్ లో దేశ జాతీయ పతాకాన్ని రెపరెపలాడించింది. ఈ టోర్నీకి ముందు తీవ్ర జ్వరంతో బాధపడ్డ శీతల్ మాతా వైష్ణోదేవీ ఆశీస్సులతో ఏ ఇబ్బంది లేకుండా పతకం గెలిచినట్లు చెప్పింది. అంతేకాదు తన ఖాతాలో ఒకే క్రీడల్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించిన ఏకైక పారా అథ్లెట్ గా కూడా చరిత్ర సృష్ఠించింది. 2023 లో బెస్ట్ యూత్ అథ్లెట్, అర్జున అవార్డ్ సాధించింది శీతల్ కుమారి.
ఈ విజయం తనది మాత్రమే కాదని.. తనని వెన్ను తట్టి ప్రోత్సహించిన భారత సైన్యంది కూడా అని శీతల్ చెప్పారు. అలాగే చిన్న సమస్యలకే కుంగిపోయే ఎంతోమందికి ఆమె ప్రయాణం ఇన్ స్పిరేషన్ కూడా. ఈ ఏడాది పారిస్ పారాలింపిక్స్ లో దేశానికి స్వర్ణం అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
మరిన్ని చూడండి