వైఎస్ విజయమ్మ.. ఇప్పుడీమె గురించే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఎన్నికలప్పుడు, వైఎస్సార్ జయంతి, వర్ధంతి రోజుల్లో మాత్రమే బయట కనిపించే ఈమె.. ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడంతో మరోసారి తెరపైకి వచ్చారు. ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల కూడా తొలిసారి ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ కూడా చేస్తున్నారు. దీంతో విజయమ్మ.. అటు కొడుకు వైపు ఉంటారా.. కూతురు సైడ్ నిల్చుంటారా..? అనేది తేల్చుకోవాల్సిన టైమ్ వచ్చేసింది. కొడుకును కాదంటే కూతురికి చెడ్డ.. కూతుర్ని కాదంటే కొడుకు దగ్గర కష్టం ఇలా ఉంది పరిస్థితి. చూశారుగా.. అదేదో అంటారో కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం అన్నట్లుగా విజయమ్మ పరిస్థితి తయారయ్యిందనే టాక్ గట్టిగానే నడుస్తోంది.
ప్రచారం చేస్తారా..?
ఇక అసలు విషయానికొస్తే.. వైఎస్సార్టీపీ ఆవిర్భావం మొదలుకుని అడుగడుగునా కూతురికి అన్ని విధాలా అండగా ఉంటూ వచ్చారు. ఆఖరికి పోలీసులు వర్సెస్ షర్మిల పరిస్థితి వచ్చినప్పుడు ఖాకీలపై విజయమ్మ చేయిచేసుకున్నారు కూడా. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేయడం.. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి. పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు షర్మిల. ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పుడో లెక్క. ఇన్నాళ్లు వేర్వేరు రాష్ట్రాలు గనుక కుమార్తెకు సపోర్టు చేస్తూ వచ్చిన విజయమ్మ.. ఇప్పుడు జగన్, షర్మిల ఇద్దరూ ఒకే రాష్ట్రంలో, సొంత ఇలాకాలో పోటీ ఉండటంతో పెద్ద చిక్కొచ్చిపడింది. ఆ మధ్య కొడుకుతో గొడవలున్నాయని.. పలకట్లేదని అందరూ అనుకున్నారు కానీ.. ఇటీవలే ఇడుపులపాయ వద్ద ఇద్దరూ ఒక్కటయ్యారు. మరి ఇప్పుడు అటు ప్రచారం చేస్తారా.. ఇటు ప్రచారం చేస్తారా..? అనేది తెలియని పరిస్థితి.
వివేకా మాటొస్తుందా..?
పోనీ షర్మిల తరఫున.. వైఎస్ జగన్ కోసం ప్రచారం చేయాల్సి వస్తే.. ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడుతారు..? షర్మిల పోటీ చేస్తున్న కడప పార్లమెంట్ స్థానం నుంచే.. వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వైఎస్సార్ సోదరుడి కుమారుడే అవినాష్. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అవినాష్ ఉన్నారు కూడా. దీంతో షర్మిల కోసం ప్రచారం చేయాల్సి వస్తే.. వైసీపీని మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ పాలన, వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా విమర్శించాల్సి వస్తుంది. జగన్ గురించి.. అవినాష్ గురించి అస్సలు మాట్లాడకుండానే ఉంటారా..? లేకుంటే తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్న షర్మిలను కూడా ఒక్కసారి గెలిపించి చట్టసభల్లోకి పంపండని చెప్పి మిన్నకుండిపోతారా..? అన్నది తేలాల్సి ఉంది. ఈ ఎన్నికలేమో గానీ.. విజయమ్మ మాత్రం పెద్ద డైలామాలో పడ్డారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.
కడప, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ (YS Vijayamma) ఎవరి వైపు..? కొడుకు జగన్ వైపా (YS Jagan) , కూతురు షర్మిల వైపా (YS Sharmila) , లేదంటే వివేకాను చంపిన అవినాశ్‌రెడ్డి వైపా..? చెప్పాలని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి డిమాండ్ చేశారు. ‘‘కడప ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య జరిగిందని షర్మిల స్పష్టంగా చెప్పారు. చిన్నాన్నను చంపిన వారిని పోటీ పెట్టినప్పుడు తాను పోటీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు.