విశాఖలో ఒక్కసారిగా పద్నాలుగు మంది వైసీపీ కార్పోరేటర్లు వెళ్ళి కూటమిలో దూకేశారు. ఇలా టోకున పెద్ద సంఖ్యలో కార్పోరేటర్లు వైసీపీని వీడడంతో మేయర్ పదవికి ఎసరు వచ్చినట్లు అయింది. మహా విశాఖ నగర పాలక సంస్థలో 59 మంది కార్పోరేటర్లు ఉన్నారు. ఇందులో పద్నాలుగు మంది వెళ్ళిపోతే ఆ సంఖ్య కాస్తా 45కి పడిపోయింది.
మొత్తం 98 మంది కార్పోరేటర్లు ఉండే జీవీఎంసీలో వైసీపీ మైనారిటీలో పడినట్లు అయింది. టీడీపీకి 29 మంది కార్పోరేటర్లు ఉన్నారు. జనసేనకు ముగ్గురు, బీజేపీకి ఒకరు ఉన్నారు ఇండిపెండెంట్లు నలుగురు ఉన్నారు. వీరు కాకుండా విశాఖలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచిన కూటమి సభ్యులు ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా ఉంటారు. అలా మ్యాజిక్ ఫిగర్ 50 నంబర్ తో కూటమి జీవీఎంసీ మేయర్ పదవిని అందుకుంటుందని అంటున్నారు.
విశాఖ కార్పోరేషన్ కి పదేళ్ళుగా ఎన్నికలు లేకపోతే జగన్ సీఎం అయ్యాక ఎన్నికలు జరిపించారు. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చినా కార్పోరేషన్ ఎన్నికలను ఈ అయిదేళ్ళలో పెట్టలేదు. అలా పదవులు అందుకున్న వారంతా జగన్ కి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి వెళ్లిపోయారు అని వైసీపీ నేతలు అంటున్నారు.
అధికారం కోసం గోడ దూకుడుకు సిద్ధపడిన కార్పోరేటర్లు ఓడిన పార్టీలో ఉండడానికి ఇష్టపడకపోవడాన్ని ప్రజలు అంతా గమనిస్తున్నారు అని అంటున్నారు. 2026 మార్చిలో ఈ పాలక మండలి గడువు ముగుస్తుంది. అపుడు జంపింగ్స్ నేతలకు టికెట్లు ఇస్తారా అసలు ఎన్నికలు పెడతారా అన్నది కూడా వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట. అయితే అధికారంలో ఉండడమే ముఖ్యం. అధికారమే విజయం కాబట్టి ఈ మాటలు ఎవరికీ పట్టవు. అలా టీడీపీ విశాఖ మేయర్ పీఠాన్ని అధిష్టించబోతోంది.