దిశ, ఫీచర్స్ : కొన్ని కొన్ని సంఘటనలు, దృశ్యాలు, ప్రదేశాలు మనల్ని ఆశ్చర్య పరుస్తుంటాయి. భయానకంగా అనిపిస్తాయి. ఇంకొన్ని అంతుపట్టకుండా ఉంటాయి. ఎంతకాలమైన మిస్టరీగానే మిగులుతుంటాయి. అలాంటి వాటిలో ‘మౌంటెన్ ఆఫ్ ది డెడ్’ ఒకటి. ఈ ఎత్తైన కొండను ‘దార్గాస్’ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడికి వెళ్లాలంటేనే జనాలు భయపడుతుంటారు. ఎందుకంటే ఆ మౌంటెన్‌పైకి గతంలో వెళ్లినవాళ్లెవరూ తిరిగి రాలేదనే ప్రచారం ఉంది. ఇప్పటికీ వెళ్లడానికి ఎవరూ సాహసం చేయడం లేదు. ఒకవేళ వెళ్తే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని చెప్తుంటారు.
రష్యా దేశంలో గల ‘మౌంటెన్ ఆఫ్ ది డెడ్’ లేదా ‘దార్గాస్’ అనే ప్రదేశం ‘నార్త్ ఓసీషియా అలానియా’ ప్రాంతానికి దగ్గరలోని గిజెల్డన్ నదీ సమీపంలో ఉంది. పూర్వకాలంలో ఈ పర్వతంపై ప్రజలు నివసించే వారని చెప్తారు. కానీ ప్రస్తుతం దానిపై ఎవరూ నివసించడం లేదు. కాకపోతే చుట్టు పక్కల చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాల ప్రజలందరూ దార్గాస్ కొండపైకి వెళ్లాలంటేనే జంకుతారు. కనీసం పగలు కూడా వెళ్లరట. రాత్రిపూట అయితే అటువైపు చూసేందుకు కూడా భయపడుతుంటారు.
కొందరు రష్యన్ టూరిజం నిపుణుల ప్రకారం ఈ పర్వతానికి ఒక చరిత్ర ఉంది. ఏంటంటే.. నార్త్ ఓసీషియా అలానియాలో మధ్య యుగంలో ఎక్కువగా ఓసీషియన్ గిరిజన తెగ ప్రజలు నివసించేవారు. వాళ్లు చనిపోయినప్పుడు డెడ్ బాడీలను ఇక్కడ ఖననం చేసేవారు. ఇప్పటికీ ఇక్కడున్న కొన్ని సమాధులు వింతగా అనిపిస్తుంటాయి. పైగా ఆ సమాధుల పక్కన పడవలను పోలిన శవపేటికలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయట. ఒక్కో సమాధి నాలుగు మీటర్ల లోతు వరకు ఉంటుందని, కొన్ని వేల అస్థిపంజరాలు ఇక్కడ కనిపిస్తుంటాయని స్థానిక ప్రజలు చెప్తుంటారు.
18వ శతాబ్దంలో ఏం జరిగిందంటే..
‘మౌంటెన్ ఆఫ్ ది డెడ్’గా పేర్కొనే దార్గాస్ పర్వతంపై సమాధులు, అస్థి పంజలు ఉండటానికి గల కారణాలను స్థానికి చారిత్రక ఆధారాలను బట్టి కొందరు పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. ఏంటంటే.. 18 శతాబ్దంలో ఒసీషియా ప్రాంతంలో ప్లేగు వ్యాధి వ్యాపించిందని, అప్పట్లో దానిని అరికట్టే ఉద్దేశంతో ఇక్కడి సమాధుల మీద నిర్మాణాలను సరిచేసి అక్కడ ప్లేగు వ్యాధి సోకిన బాధితులను ఉంచేవారు. అంటువ్యాధి కావడంవల్ల ప్రజలు భయపడి రోగులకు కావాల్సిన ఆహారాన్ని, దుస్తులను దూరం నుంచి విసిరేవారు. అయితే దీనిపై ప్రస్తుతం అయితే పరిశోధనలు ఏమీ జరగలేదు. కాబట్టి ఇప్పటికీ ఈ దార్గాస్ పర్వతానికి సంబంధించిన అంశాన్ని చాలామంది ఒక మిస్టరీగానే భావిస్తుంటారు.
అస్థిపంజరాలుగా మారిన మనుషులు
వ్యాధిగ్రస్తులైన వ్యక్తులు ‘దార్గాస్’ కొండపై నుంచి కిందికి రావడానికి వీల్లేదని అప్పట్లో ఆంక్షలు విధించేవారు. అక్కడికి ఎవరూ వెళ్లేవారు కాదు. దీంతో ఆ ఎత్తైన పర్వతంపై ఎంతో మంది మరణించడం, వారి డెడ్ బాడీస్ ఖననం చేయకపోవడం కారణంగా అవి అస్థిపంజరాలుగా మిగిలిపోయాయి. ఇలా తరతరాలుగా కొనసాగిన భయం క్రమంగా దార్గాస్ కొండ ప్రాంతానికి ‘మౌంటెన్ ఆఫ్ డెడ్’గా పేరు వచ్చేందుకు కారణమైంది. అప్పటి భయమే నేడు ప్రజలను అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటోంది. అయితే కొందరు సాహసికులు మాత్రం ఇటీవల వెళ్లి కాస్త దూరం నుంచి ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారట. కానీ ప్రజలు మాత్రం వెళ్లడానికి జంకుతున్నారు.