మామూలుగానే సినీ సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి గురించి గాసిప్స్ వస్తుంటాయి. అలాంటిది ఒక హీరోయిన్, ఒక డైరెక్టర్ పూల దండలతో ఉన్న ఫోటో కనిపిస్తే ఇంకేమైనా ఉందా?. ఇద్దరూ సైలెంట్ గా పెళ్లి చేసుకున్నారు, ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పటినుంచి ఉందో ఏంటో అంటూ రకరకాల కామెంట్స్ వినిపిస్తాయి. తాజాగా టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవికి అలాంటి అనుభవమే ఎదురైంది.
తమిళ హీరో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి ఒక సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు. ఈ మూవీ లాంచ్ మేలో జరిగింది. పూజా కార్యక్రమంలో పాల్గొన్న మూవీ టీం మెడలో పూల దండలతో క్లాప్ బోర్డులను పట్టుకొని ఫొటోలకి ఫోజులిచ్చారు. అయితే ఆ ఫోటోలలో సాయి పల్లవి, డైరెక్టర్ రాజ్ కుమార్ పూల దండలతో పక్కపక్కన నిల్చొని ఉండటంతో.. కొందరు ఆ ఫోటోలను క్రాప్ చేసి సాయి పల్లవికి సీక్రెట్ గా పెళ్లయిందని తప్పుడు ప్రచారం చేశారు. ఆ ఫోటోలు చూసి చాలామంది ఆ వార్త నిజమనే నమ్మారు. కొందరు డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుందని అనుకోగా, మరికొందరు మాత్రం అతన్ని గుర్తుపట్టక ఆ వ్యక్తి ఎవరా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇలా ఫేక్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. సాయి పల్లవి కాస్త ఘాటుగానే స్పందించింది.
“నిజం చెప్పాలంటే, నేను రూమర్స్ ని పట్టించుకోను. కానీ అది కుటుంబ సభ్యుల్లాంటి స్నేహితుల గురించి అయినప్పుడు, నేను ఖచ్చితంగా మాట్లాడాలి. నా సినిమా పూజా కార్యక్రమం నుండి ఒక ఫోటో ఉద్దేశపూర్వకంగా క్రాప్ చేయబడింది. దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేశారు. ఇలా చేయడం నీచమైన చర్య” అంటూ సాయి పల్లవి మండిపడింది.