అసంతృప్తిని చల్లార్చేందుకేనా?
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యేలపై కొద్దిరోజుల కిందట తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వొద్దంటూ నియోజకవర్గంలోని కొందరు నేతలు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. మహబూబాబాద్ మండలం ముడుపుగల్లు, కేసముద్రం, మదనకుర్తి గ్రామాల్లోని మామిడితోటల్లో అసమ్మతి నేతలంతా మీటింగులు పెట్టుకుని శంకర్ నాయక్కు టికెట్ ఇవ్వద్దంటూ తీర్మానాలు చేసుకున్నారు. ఇక వర్ధన్నపేట నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, హసన్ పర్తి పీఏసీఎస్ ఛైర్మన్ బిల్లా ఉదయ్ రెడ్డి, ఉద్యమకారులు, ఇతర నేతలు అసమ్మతి రాజేసి.. అరూరికి టికెట్ ఇవ్వొద్దంటూ మంత్రి దయాకర్రావుతో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు వినతిపత్రాలు ఇచ్చారు. దీంతో వినోద్ కుమార్ తో పాటు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇరువర్గాలకు సర్ది చెప్పి తాత్కాలికంగా అసమ్మతిని చల్లార్చారు. కాగా ఇప్పటికీ కొందరిలో అసంతృప్తి రగులుతుండగా.. ఆ ప్రభావం ఓటర్లపై పడకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ టూర్ ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ జనాల్లో సీఎం కేసీఆర్ అంటే అభిమానం ఉండగా.. ఆయన మాటల మ్యాజిక్కు ప్రభావం చూపిస్తే.. అంతా సెట్ అయిపోతుందనే భావనలో ఎమ్మెల్యేలు ఉన్నారట. అందుకే సీఎం కేసీఆర్ ను పట్టుబట్టి మరీ తమతమ నియోజకవర్గాలను తీసుకెళ్లేందుకు పోటీ పడుతున్నట్లు తెలిసింది.