వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అంటే శ్రీరెడ్డి పేరే వినిపిస్తుంది. ఏదో ఒక అంశంపై వివాదాన్ని లేవనెత్తడం, దానిపై ఎవరో ఒకరు కామెంట్ చేయడం, దానికి శ్రీరెడ్డి కౌంటర్ వేయడం.. ఇవన్నీ ఆమెకు సర్వసాధారణమైన విషయాలు. ఎన్నికల ముందు సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరీ కామెంట్స్ పెట్టేది. తీవ్ర పదజాలంతో మాట్లాడుతూ వీడియోలు పెట్టేది. వారు, వీరు అనే తేడా లేకుండా టీడీపీ, జనసేనకు సంబంధించిన అందర్నీ టార్గెట్ చేసేది. చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్‌లపై తీవ్రమైన విమర్శలు చేసేది. వైసీపీని సపోర్ట్ చేస్తూ మిగతా వారి దుయ్యబట్టేది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తను ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని బాధపడుతోంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరఫున మాట్లాడేది. మిగతా పార్టీల వారిని తిడుతూ కాలక్షేపం చేసేది. ఆ విధంగా సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూడడంతో శ్రీరెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎందుకంటే వైసీపీ తరఫున ఎన్ని పోస్టులు పెట్టినా ఆ పార్టీ ఎప్పుడూ ఆమెను ఓ కార్యకర్తగా గుర్తించలేదు. ఆమె గురించి ఆ పార్టీలోని ఏ ఒక్కరూ మాట్లాడేవారు కాదు. కానీ, శ్రీరెడ్డి మాత్రం జగనన్న అంటూ తెగ పోస్టులు పెట్టేది. వైసీపీ తనను గుర్తించకపోవడంతో శ్రీరెడ్డి తీవ్ర మనోవేదనకు గురవుతోందట. తన మానసిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
‘నా మానసిక పరిస్థితి ఏమీ బాగా లేదు. ఒక విధంగా మెంటల్ ట్రోమాలోకి వెళ్లిపోతున్నాను. నేను మామూలు స్థితికి ఎప్పుడు వస్తానో అర్థం కావడం లేదు. ఆ భద్రకాళే నన్ను కాపాడాలి. ఈమధ్య నాకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వస్తోంది. మీడియా, టీడీపీ, జనసేన నన్ను టార్చర్ చేస్తున్నాయి. అది నేను భరించలేకపోతున్నాను. నేను ఎంత కాలం బ్రతికి ఉంటానో అర్థం కావడం లేదు. ఈ స్థితి నుంచి బయటికి రావాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను. కానీ, సాధ్యం కావడం లేదు. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితిని చూసి అందరూ నవ్వుకుంటారని కూడా నాకు తెలుసు’ అంటూ పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.