ఆధ్మాత్మిక న‌గ‌రంలో జ‌న‌సేన గ‌ల్లీ లీడ‌ర్ అరాచ‌కం!


ఆధ్యాత్మిక న‌గ‌ర‌మైన తిరుప‌తిలో జ‌న‌సేన గ‌ల్లీ లీడ‌ర్ అరాచ‌కానికి తెర‌లేపాడు. జ‌న‌సేన అధ్య‌క్షుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరు చెప్పుకుంటూ తిరుప‌తిలో దాదాగిరి చేస్తూ దుకాణ‌దారులు, పెద్ద‌పెద్ద హోట‌ళ్లు, లాడ్జీల య‌జ‌మానుల నుంచి భారీ మొత్తంలో డ‌బ్బు దోచుకుంటున్నాడు. ఇక్క‌డ ట్విస్ట్ ఏమంటే… జ‌న‌సేన ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు మాత్రం ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌క‌పోవ‌డం. ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు దాదాగిరిని ప్రోత్స‌హించ‌డం లేద‌నే మాట వినిపిస్తోంది.

కానీ తాను ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాలూకూ అని, ప్ర‌భుత్వం త‌మ‌దంటూ ఆ గ‌ల్లీ లీడ‌ర్ చేస్తున్న అరాచ‌కంతో జ‌న‌సేన‌కు చెడ్డ‌పేరు వ‌స్తోంది. తిరుప‌తిలో 40, 41 డివిజ‌న్ల జ‌న‌సేన అధ్య‌క్షుడిగా చెలామ‌ణి అవుతున్న ఆ పోకిరీ చేష్ట‌ల‌కు క‌పిల‌తీర్థం, తిరుమ‌ల బైపాస్‌, అలిపిరి, అన్నారావు స‌ర్కిల్ త‌దిత‌ర ప్రాంతాల్లోని వ్యాపారులు హ‌డ‌లిపోతున్నారు.

వ్యాపార స‌ముదాయాల వ‌ద్ద‌కు 20 నుంచి 30 మంది ఆకు రౌడీలు, గంజాయి బ్యాచ్‌ను పంపుతూ బెదిరింపుల‌కు దిగుతుండ‌డం ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆందోళ‌న రేకెత్తిస్తోంది. తాజాగా క‌పిల‌తీర్థంలో క‌పిలేశ్వ‌రుడి ఆల‌య స‌ముదాంలో దుకాణదారుల‌పై దాడి వెలుగు చూసింది. ఎక్క‌డి నుంచి బ‌తుకుదెరువు కోసం వ‌చ్చిన త‌మ‌ను హ‌రిశంక‌ర్ రాయ‌ల్ అనే జ‌న‌సేన నాయ‌కుడు వేధిస్తున్నాడంటూ బాధిత బాలిక మీడియా ఎదుట వాపోవ‌డం గ‌మ‌నార్హం.

ఇలా మీడియా ముందుకు వ‌చ్చి చెప్పుకున్న వాళ్ల‌లో కేవ‌లం ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే ఉన్నారు. కానీ ఈ చిల్ల‌ర‌గాళ్ల‌తో అనవ‌స‌రంగా గొడ‌వ‌లెందుకుని ల‌క్ష‌ల్లో ముట్ట‌చెప్పిన వ్యాపారులు లేక‌పోలేదు. ఇలాంటి వాళ్లు త‌మ గోడును స‌న్నిహితుల వ‌ద్ద మొర‌పెట్టుకుంటున్నారు. ఒక‌వైపు ప‌వ‌న్‌క‌ల్యాణ్ నీతులు వింటే కోట‌లు దాటుతున్నాయి.

మ‌రోవైపు ఆయ‌న పేరు చెప్పుకుని బాధిత బాలిక చెబుతున్న హ‌రిశంక‌ర్ రాయ‌ల్ లాంటి వారు బెదిరింపుల‌కు పాల్ప‌డుతూ, అధికారాన్ని సొమ్ము చేసుకునే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇప్ప‌టికైనా తిరుప‌తి లాంటి ఆధ్మాత్మిక న‌గ‌రానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌ల్ల మంచి జ‌ర‌గ‌క‌పోయినా, చెడు జ‌ర‌గ‌క‌పోతే చాల‌ని స్థానిక వ్యాపారులు వేడుకుంటున్నారు. జ‌న‌సేన త‌క్ష‌ణం స్పందించాల్సిన అవ‌స‌రం వుంది.



Source link

Leave a Comment