Top Stories

ఆ పర్వం పూర్తయ్యేదాకా జగన్ కోటరీలో కంగారే!


ఎడాపెడా అభ్యర్థులను మార్చేసే కసరత్తును జగన్మోహన్ రెడ్డి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా పిలుపు రాని ఎమ్మెల్యేలు అందరికీ టికెట్ గ్యారంటీ అని అనుకుంటే పొరబాటు. ఏ క్షణంలో ఎవ్వరికైనా ఎండ్ కార్డు పడిపోవచ్చు. ఈ కంగారు అందరు ఎమ్మెల్యేల్లోనూ ఉంది. అలాగని జగన్ కోటరీ నిశ్చింతగా ఉన్నదని అనుకుంటే కూడా పొరబాటే.

ఎమ్మెల్యేల కోటాలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అటు అధికార పార్టీలో కూడా పుట్టెడంత కంగారు ఉంది. ఆ ఎన్నిక పూర్తయ్యేదాకా వారి కంగారు కూడా తొలిగే అవకాశం లేదు. 

రాజ్యసభలో ఏపీ నుంచి ఖాళీ అవుతున్న మూడు ఎంపీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. బిజెపి ఎంపీ సీఎం రమేష్, తెదేపా కనకమేడల రవీంద్ర, వైసీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల సీట్లు ఖాళీ అవుతాయి.

ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో 151 సీట్ల బలం ఉంది. ఏపీలో ఒక్కో ఎంపీ సీటును దక్కించుకోవాలంటే.. 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. ఆ లెక్కన వైసీపీ చాలా సునాయాసంగా మూడు సీట్లను దక్కించుకోవాలి. అందుకే మొత్తం ముగ్గురు అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించేసింది కూడా. అయితే.. వీరందరూ నెగ్గుతారా లేదా అనే భయం మాత్రం వారిలో ఉంది. తెలుగుదేశం పోటీకి దిగితే పరిస్థితి ఏమిటి? అనే ఆందోళన ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా సరే తెలుగుదేశం రంగంలోకి దిగి అనూహ్యంగా విజయం సాధించింది. ఆ మ్యాజిక్ ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందా అనే అనుమానం ఉంది. 

ప్రస్తుత బలాబలాలు చూస్తే తెలుగుదేశానికి ఉన్న 23 లో నలుగురు వైసీపీ పంచన ఉన్నారు. జనసేన ఎమ్మెల్యే కూడా అక్కడే ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు నలుగురు తెదేపాతో అంటకాగుతున్నారు. ఇప్పుడు ఈ తొమ్మిదిమందికి ఫిరాయింపు నోటీసులు వెళ్లిన తర్వాత.. స్పీకరు పిలిచి మాట్లాడితే.. వైసీపీ నలుగురిపై వేటు పడి, మిగిలిన అయిదుమందిపై వేటు పడకుండా నిర్ణయాలు రావొచ్చు. ఈలోగా- ఇప్పుడు గంటా రాజీనామాను ఆమోదించినట్టే, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా కూడా ఆమోదం పొందవచ్చు. 

అప్పుడు అయిదుగురు సొంత ఎమ్మెల్యేలను కోల్పోయి, అయిదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ జట్టులో ఉండగా.. వైసీపీ బలం స్థిరంగా 151 వద్ద ఉంటుంది. తెదేపా బలం 17 వద్ద ఉంటుంది. ఈ గణాంకాలను చూస్తే.. వైసీపీ మొత్తం మూడు స్థానాలను గెలుచుకోవడానికి ఇబ్బందేం లేదనిపిస్తుంది. కానీ.. 151లో ఎందరు జగన్ విధేయతకు కట్టుబడి ఉన్నారనేది ప్రశ్న. మార్పు చేర్పుల నేపథ్యంలో కాపు రామచంద్రారెడ్డి తరహాలో జగన్ మీద ఆగ్రహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారు.

కొందరు ఇప్పటికే బయటపడగా.. కొందరు గుంభనంగా ఉన్నారు. అయితే వారు రాజీనామాలు చేయలేదు. తెదేపా తీర్థం పుచ్చుకోలేదు- వారి సభ్యత్వాన్ని రద్దు చేయడం కూడా కుదరదు. అలాంటి అసంతృప్త ఎమ్మెల్యేలు.. పార్టీ విప్ జారీచేసినా సరే, ధిక్కరించి వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసే ప్రమాదం ఉంది. అలాంటి వారు ఎందరు? అనేదే లెక్కతేలాలి. కనీసం 20-25 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు తేడాగా ఓటు వేస్తే గనుక.. ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. అప్పుడు జగన్ వ్యూహాలేవీ ఫలించవు.

మార్పుచేర్పులు పర్యవసానంగా అసంతృప్తితో వేగుతున్న వారిని కనీసం రాజ్యసభ ఎన్నికల వరకైనా బతిమాలి బుజ్జగించి తమ జట్టులో ఉంచుకోవాల్సిన అవసరం వైసీపీకి ఉంది. మరి ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.



Source link

Related posts

ఆ హీరోయిన్ కు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు

Oknews

మన్యం మహిళా రైతుకు వైఎస్సార్ అవార్డు

Oknews

అడవి శేష్ మీద 150 కోట్లు

Oknews

Leave a Comment