దిశ, ఫీచర్స్ : జలుబు, దగ్గు అనేది సర్వసాధారణం. వాతావరణం మారిన వెంటనే జలుబు, దగ్గు, జ్వరం వ్యాప్తి చెందుతూనే ఉంటాయి. అంతే కాదు కొంచం డస్ట్ అలర్జీ ఉన్నా జలుబు పట్టేస్తుంది. వీటి కారణంగా ఎంతో మంది వైద్యుల వద్దకు వెళ్తుంటారు. అయితే కొన్నిసార్లు సాధారణ వ్యాధులుగా అనిపించేవి ప్రమాదకరంగా మారతాయి. అవి మనుషులను వికలాంగులుగా మార్చడం మాత్రమే కాదు వారి ప్రాణాలను కూడా తీయగలవని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలోని ఓ మహిళ విషయంలో అలాంటి సంఘటనే జరిగింది. ఆమెకు చిన్నగా మొదలైన జలుబు ప్రమాదకరమైన వ్యాధిగా మారింది. దీంతో ఆమె శాశ్వతంగా వికలాంగురాలిగా మిగిలిపోయింది.
పూర్తి వివరాల్లోకెళితే అమెరికాకు చెందిన ఓ మహిళ పేరు షెర్రీ మూడీ. షెర్రీ వయస్సు (51) ఆమె అమెరికాలోని టెక్సాస్ నివాసి. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం షెర్రీ ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. తాను పాఠశాల విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్లానని, అక్కడ తనకు కొన్ని సమస్యలు ఎదురయ్యాయని చెప్పింది. ఆమె చేతులు, కాళ్ళు అకస్మాత్తుగా చల్లగా మారి మంచులా గడ్డకట్టడం ప్రారంభించాయని తెలిపారు. దీనికి ముందు కాస్త జలుబు, జ్వరం వచ్చిందని తెలిపారు. మొదట్లో ఇది సాధారణమే అనుకున్నా తర్వాత ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ గా మారింది. ఐదు రోజుల్లోనే మహిళ పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారట. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు స్ట్రెప్టోకోకస్ అనే ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్‌తో సోకిందని తెలిపారు. కొద్దిసేపటికే, ఈ ఇన్ఫెక్షన్ ఆమె శరీరంలో పూర్తిగా వ్యాపించి ఆమె రెండు చేతులు, కాళ్ళు తీసేయాల్సి వచ్చిందని తెలిపారు.