posted on Sep 29, 2023 4:15PM
ఇప్పటికాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలడం. ఈ సమస్య అన్ని రకాల వయసుల వారిలో ఉంది. చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఫాలో అవుతున్నా కాలం గడిచేకొద్ది జుట్టు రాలడం జరుగుతూనే ఉంటుంది. మగవారిలో బట్టతల, ఆడవారిలో జుట్టు పలుచబడటం, తలమీది చర్మం బయటకు కనిపించడం(దీన్ని మహిళలలో బట్టతలగా వర్ణిస్తారు). ఇది జన్యుసమస్యల కారణంగా ఎదురయ్యే సమస్య. బట్టతల పరిష్కారానికి ఎలాంటి ప్రత్యేక వైద్యం అందుబాటులో లేకపోయినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని ఫాలో అవ్వడం ద్వారా బట్టతలను సమర్థవంతంగా అధిగమించవచ్చు.
జుట్టు ఆరోగ్యం ఆహారంతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. బలమైన, ఆరోగ్యకరమైన జుట్టును నిర్వహించడానికి అవసరమైన పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ప్రోటీన్, ఐరన్, బయోటిన్, విటమిన్ A,D చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. ఆహారంలో లీన్ మాంసాలు, చేపలు, గుడ్లు, ఆకు కూరలు, పప్పుధాన్యాలు మరియు గింజలు వంటి ఆహారాలను చేర్చుకోవాలి. ఆహారం ద్వారా సరిపడినంత పోషకాలు తీసుకోలేకపోతే సప్లిమెంట్లు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి, అయితే ఏదైనా సప్లిమెంట్లను తీసుకునేముందు వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు సప్లిమెంట్లు వాడాలి. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు వైద్యులు సూచించే మందులు కూడా తీసుకోవాలి. ఇవి జన్యుపరంగా సంభవించే బట్టతలకు అడ్డుకట్ట వేస్తాయి. ఆండ్రోజెనెటిక్ అలోపేసియా ఉన్నవారిలో జుట్టు రాలడానికి కీలకమైన హార్మోన్లను నిరోధించడంలో మందులు ప్రభావవంతంగా ఉంటాయి.అయితే వీటిని వైద్యుల సలహాతో మాత్రమే వాడాలి. ఎందుకంటే ఇవి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలిగి ఉంటాయి.
జుట్టు రాలడానికి చాలామందిలో కారణమయ్యే అంశం ఒత్తిడి. అధిక డిప్రెషన్ జుట్టురాలడాన్ని మరింత వేగవంతం చేస్తుంది. దీన్ని అధిగమించడానికి ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటివి చాలా బాగా పనిచేస్తాయి. ధూమపానం, మధ్యపానం వంటి అలవాట్లు ఉంటే మానేయడం. జుట్టు సంరక్షణ చర్యలు తీసుకోవడం. రసాయనాలు లేని ఉత్పత్తులను వాడటం. వీలైనంత వరకు సహజమైన ఉత్పత్తులను జుట్టుకు వినియోగించడం. ఎప్పటికప్పుడు వైద్యలను కలుస్తూ జాగ్రత్తలు పాటించడం వల్ల వంశపార్యపరంగా జుట్టురాలిపోయి బట్టతల వచ్చేవారి సమస్యను పరిష్కరించవచ్చు.
*నిశ్శబ్ద.