ఏ రంగంలో అయినా ప్రోత్సాహం అనేది సంజీవిని లాంటింది. ఆ ప్రోత్సాహమే ఉంటే ఎవరైనా తాము అనుకున్నది సాధిస్తారు.ఈ విషయంలో కళాకారులకి కొంచం ఎక్కువ ప్రోత్సాహమే అవసరం.ఎందుకంటే కళ ఒక మనిషిని ఆనందింప చేస్తుంది, ఆలోచింప చేస్తుంది, జీవితంలో ఎలా బతకాలో చెప్తుంది.అలాంటి కళలో అగ్ర తాంబూలం సినిమాది.అలాంటి సినిమాలో నటించే సినిమా నటులకి ప్రోత్సాహం రూపంలో అందుకునే అవార్డ్స్ ని ఇస్తే వాళ్ళు మరిన్ని మంచి పాత్రలు చేసి ప్రజల్ని ఆనందింపచేస్తారు. కానీ సినిమా వాళ్ళకి కానీ కొన్ని సంవత్సరాలుగా ఒక ప్రతిష్టాత్మక అవార్డు ని ప్రభుత్వాలు ఇవ్వటంలేదు. కానీ తాజాగా ప్రకటించిన ఒక సమాచారం తెలుగు సినిమా నటులకి మంచి ఊతాన్ని ఇస్తుంది.
తెలుగు సినిమా పరిశ్రమ యొక్క రాజధాని హైదరాబాద్ కాబట్టి ప్రభుత్వం తెలుగు సినిమా కళాకారులు అత్యంత ప్రతిష్టాత్మకమైన నంది అవార్డు ని ఇచ్చే వాళ్ళు. ఇప్పుడు నంది తన పేరుని మార్చుకొని గద్దర్ అవార్డు గా రాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొన్ని సంవత్సరాలుగా నంది అవార్డ్స్ ని ఇవ్వని పక్షంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి అవార్డ్స్ పేరుని చేంజ్ చేసి అయినా ఇస్తున్నాడు అనడం చాలా సంతోషం అని పలువురు సినీ పెద్దలు అంటున్నారు. సో ఇన్నాళ్లు నంది అవార్డు తీసుకొని మురిసిపోయే కళాకారులు ఇక నుంచి గద్దర్ అవార్డు ని తీసుకొని మురిసిపోనున్నారు.
దివంగత గద్దర్ కూడా గతంలో చాలా సినిమాల్లో నటించడమే కాకుండా ఎన్నో సినిమాలకి పాటలని అందించి తాను ఎంత పెద్ద సాహితీవేత్తో చాటి చెప్పాడు.ఆయన అమ్ములపొదిలో నుంచి వచ్చిన ఎన్నో పాటలు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చాయి. గతంలో ఇచ్చిన నంది అవార్డ్స్ ని ఒక సారి పరిశీలనలోకి తీసుకుంటే వెంకటేష్ అత్యధిక సార్లు నందిని దక్కించుకుకోగా ఆ తర్వాత స్థానంలో మహేష్ నిలిచాడు. చివరిగా నందిని ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ చిత్రానికి గాను అందుకున్నాడు.