ఇప్పటిదాకా తన దర్శకత్వంలో వచ్చింది రెండే సినిమాలు అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. 2014లో వచ్చిన ‘రన్ రాజా రన్’తో దర్శకుడిగా పరిచయమైన సుజీత్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘సాహో’ సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ చిత్రం తెలుగునాట పెద్దగా ఆదరణ పొందనప్పటికీ.. నార్త్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. రోజులు గడిచే కొద్దీ ఆ సినిమాని అభిమానించే వారి సంఖ్య పెరుగుతోంది.
ఇక సుజీత్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘ఓజీ’ అనే గ్యాంగ్ స్టర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత నేచురల్ స్టార్ నానితో దర్శకుడు సుజీత్ ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.
మిగతా యంగ్ స్టార్స్ తో పోలిస్తే నాని లైనప్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. విభిన్న కథలు, విభిన్న పాత్రలు ఎంచుకుంటూ.. సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తుంటాడు. గతేడాది ‘దసరా’ వంటి ఊర మాస్ సినిమాతోనూ, ‘హాయ్ నాన్న’ వంటి పూర్తి క్లాస్ సినిమాతోనూ మెప్పించాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది. దీని తర్వాత డైరెక్టర్ సుజీత్ తో చేతులు కలబోతున్నాడు.
నాని పుట్టినరోజు(ఫిబ్రవరి 24) సందర్భంగా, తాజాగా నాని-సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ప్రకటన వచ్చింది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకుంటోంది. వీడియోలో “When a violent man turns non-violent.. his world turns upside down”(ఒక హింసాత్మక వ్యక్తి అహింసాత్మకంగా మారినప్పుడు.. అతని ప్రపంచం తలక్రిందులుగా మారుతుంది) అంటూ సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని కెరీర్ లో 32వ సినిమాగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఫిల్మ్ వచ్చే ఏడాది ప్రేక్షకులను పలకరించనుంది.
సుజీత్ తో పాటు మరో ఇద్దరు దర్శకులకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘బలగం’ వేణు దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే పీరియాడిక్ లవ్ స్టోరీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అలాగే ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సైతం నానితో కలిసి మరో బ్లాక్ బస్టర్ అందించాలని చూస్తున్నాడు.