posted on Jan 15, 2025 12:01PM
చాయ్.. భారతీయులకు ఎమోషన్. పట్టణాలలో టీ దుకాణాలలో టీ ఎప్పుడూ ఉడుకుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టు ప్రజలు కూడా టీని అమృతంలాగా జుర్రుకుని తాగుతుంటారు. కొందరికి టీ తాగకపోతే అసలు ఏ పని చేయాలని అనిపించదు. ఇక కష్టపడి పనిచేసేవారు బద్దకం, నిద్ర వదిలి శరీరం చురుగ్గా ఉండటం కోసం రోజులో చాలా సార్లు టీ తాగుతుంటారు. టీ అనేది రుచినే కాదు.. మితంగా తాగితే ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. టీ లో ఉన్న రకాలు.. ఫ్లేవర్ లు టీని మళ్లీ మళ్లీ తాగాలని అనిపించేలా చేస్తాయి. కానీ కొన్ని సమస్యలున్న వారు టీ తాగడం అస్సలు మంచిది కాదట. ఇంతకీ టీ ని ఎవరు తాగకూడదో తెలుసుకుంటే..
యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉన్న వ్యక్తులు టీ తీసుకోవడం మంచిది కాదట. టీ లో ఉండే కెఫిన్ కంటెంట్ యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను ఇంకా ఎక్కువ చేస్తుంది. కడుపులో ఏర్పడే యాసిడ్లు అధికం అయ్యి అవి ఛాతీ వరకు వచ్చి ఛాతీలోనూ, గుండెల్లోనూ మంట పెడుతుంటాయి. ఈ సమస్యను యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. ఈ సమస్య ఉన్నవారు చాయ్ తాగితే ఈ సమస్య మరింత పెరుగుతుంది.
గర్భం దాల్చిన మహిళలు టీకి దూరంగా ఉండటమే మంచిదట. టీలో కెఫీన్ ఉంటుంది. దీన్ని గర్భవతులు తాగితే కెఫీన్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కెఫీన్ పానీయాలు కడుపులో బిడ్డ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా కెఫీన్ ఎక్కువగా తీసుకుంటే పుట్టే బిడ్డ జుట్టు రాగి రంగులో ఉంటుంది. అంతేనా.. గర్భవతులు చాయ్ ఎక్కువ తీసుకుంటే శరీరం ఐరన్ గ్రహించే శక్తిని కోల్పోయి రక్తహీనత సమస్య ఏర్పడుతుంది.
ఇప్పటికే ఐరన్ లోపం ఉన్నవారు టీని తీసుకోకపోవడం మంచిది. టీ లో ఉండే కెఫీన్, టానిన్ లు శరీరంలో ఐరన్ శోషణకు అంతరాయం కలిగిస్తాయి. రక్తహీనత సమస్యను మరింత పెంచుతాయి.
మధుమేహం ఉన్నవారు టీని తీసుకోవడం మంచిది కాదు. సాధారణంగా టీలో తీపి ఉంటేనే దాని రుచి మెరుగ్గా ఉంటుంది. టీలో చక్కెర, బెల్లం వంటివి జోడించినవి తీసుకుంటే మధుమేహం సమస్య పెరుగుతుంది. బెల్లం తో చేసిన టీ అయినా రోజూ తాగుతూ ఉంటే ప్రమాదం.
12 సంవత్సరాల కంటే చిన్న వయసు ఉన్న పిల్లలు టీలోని కెఫీన్ కంటెంట్ వల్ల ఏకాగ్రత విషయంలో డిస్టర్బ్ అవుతారు. ఇది చదువులోనూ, నిద్రలోనూ ఆటంకం కలిగిస్తుంది.
*రూపశ్రీ.