ఓవైపు థియేట్రికల్ సిస్టమ్ పూర్తిగా పడుకుంది. పెద్ద సినిమా వస్తే ఓపెన్ చేస్తున్నారు, లేదంటే మూసేస్తున్నారు. కరెంట్ బిల్లులు కట్టడానికి ఎగ్జిబిటర్లు అప్పులు చేస్తున్న పరిస్థితి. మరోవైపు నాన్-థియేట్రికల్ కూడా ఏమంత గొప్పగా లేదు. శాటిలైట్ మార్కెట్ పూర్తిగా డల్ అయింది. కేవలం డిజిటల్ రైట్స్ మాత్రమే కళ్లకు కనిపిస్తోంది. ఇక ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఓవైపు టాలీవుడ్ పరిస్థితి ఇలా కళ్లకు కడుతుంటే, మరోవైపు సినిమాల బడ్జెట్స్ మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. మార్కెట్ ఉన్న హీరోలకు బడ్జెట్ కాస్త పెరిగినా ఓకే అనుకోవచ్చు. కానీ చిన్న హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు అంతా బడ్జెట్ పెంచేస్తున్నారు. ఏం చూసుకొని ఈ ధైర్యం.
సాయిధరమ్ తేజ్ కెరీర్ లో వంద కోట్ల సినిమా విరూపాక్ష మాత్రమే. అది కూడా వంద కోట్ల మార్క్ అందుకోవడానికి చివర్లో కాస్త కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఈ హీరో నెక్ట్స్ మూవీకి బడ్జెట్ అమాంతం పెంచేశారు. 120 కోట్ల రూపాయలు అంటున్నారు.
కిరణ్ అబ్బవరం.. మార్కెట్ పరంగా చిన్న హీరో. రీసెంట్ గా హిట్ కొట్టిన దాఖలాలు కూడా లేవు. కానీ తన తాహతకు మించి ఖర్చు చేశాడు ‘క’ సినిమా కోసం. అడిగితే, పాన్ ఇండియా లెవెల్లో హిట్టయ్యే కంటెంట్ అంటున్నాడు. అది అతడి నమ్మకం.
ఇక తేజ సజ్జా సంగతి సరేసరి. హనుమాన్ అనే ఒకే ఒక్క సినిమాతో తేజ సజ్జ సినిమా బిజినెస్ లెక్కలు మారిపోయాయి. అతడి నెక్ట్స్ సినిమా ఏ రేంజ్ కు వెళ్తుందో తెలీదు కానీ, మిరాయి సినిమా కోసం కళ్లు మిరుమిట్లుగొలిపే బడ్జెట్ ఖర్చుచేస్తున్నారు. అలా అని సక్సెస్ ఫుల్ దర్శకుడు డైరక్ట్ చేస్తున్న సినిమా కూడా కాదిది.
ఇలా చెప్పుకుంటూపోతే చాలామంది హీరోల సినిమాల బడ్జెట్లు పెరిగిపోయాయి. ధమాకా తర్వాత ఒక్క హిట్ లేని రవితేజ 75వ చిత్రం కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఇప్పటికే భారీగా ఖర్చయింది. ఇప్పుడు మెకానిక్ రాకీది కూడా అదే పరిస్థితి.
నితిన్ రాబిన్ హుడ్ సినిమా అతడి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా అంటున్నారు. అతడు చివరిసారి హిట్ కొట్టి చాన్నాళ్లయింది. ఇక నాని అయితే తన సినిమా బడ్జెట్ ను ఏటా పెంచుకుంటూ పోతున్నాయి. త్వరలోనే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. ఇదే అతడి కెరీర్ హయ్యస్ట్ బడ్జెట్ మూవీ అంటున్నారు. అటుఇటుగా 150 కోట్లు బడ్జెట్ అంట. ఈ హీరోలతో సినిమాలు తీస్తున్న నిర్మాతలకు దండం పెట్టాలి.
The post ఏం చూసుకొని ఇలా రేట్లు పెంచేస్తున్నారు? appeared first on Great Andhra.