ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని వైసీపీ డిమాండ్ చేసింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభలలో వైసీపీ పక్ష నాయకులు మిధున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి హాజరయ్యారు. వాళ్లిద్దరూ మాట్లాడుతూ విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు.
అయితే ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు నోరు మెదపకపోవడం గమనార్హం. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ మంత్రులు కూడా ఉన్నారు. ప్రత్యేక హోదాకు గతంలో కూటమి హయాంలోనే మంగళం పాడారు. ప్రత్యేక హోదాకు బదులు, ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న విషయాన్ని కేంద్ర పెద్దలు పలుమార్లు గుర్తు చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా వుండగా ఇదే సమావేశంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన జేడీ(యూ) ఎంపీలు మాత్రం బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం విశేషం. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకతను జేడీ(యూ) నేతలు సమావేశంలో తెలియజేయడం ప్రశంసలు అందుకుంటోంది.
ఏపీ రాజకీయ పక్షాలది విచిత్ర వైఖరి. గతంలో ఐదేళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదాపై చేతులెత్తేశారు. ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజార్టీ వుండడం వల్ల ప్రత్యేక హోదా డిమాండ్‌పై ప్రధాని మోదీ పట్టించుకోరని చెప్పారు. ఇప్పుడు అధికారం పోగానే ప్రత్యేక హోదా వైసీపీకి గుర్తు రావడం గమనార్హం. టీడీపీ మాత్రం ఎప్పట్లాగే ప్రత్యేక హోదాను పట్టించుకోలేదు.