పింఛన్ పాలిటిక్స్
ఏపీలో వాలంటీర్లతో సంక్షేమ పథకాలకు(Welfare Schemes) నగదు పంపిణీ చేయించొద్దని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ (Election Code)ముగిసే వరకూ వాలంటీర్లను ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. వాలంటీర్ల(Volunteers) వద్దనున్న మొబైల్, ఇతర పరికరాలు ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అయితే దీనికి ప్రతిపక్షాల కారణమని అధికార వైసీపీ ఆరోపిస్తుంటే… వైసీపీ అధికార దాహమే ఈ పరిస్థితులు తెచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాలంటీర్లు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం, ఎన్నికల కోడ్ ను తరచూ ఉల్లంఘించడంతో ఈసీ వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో చివరికి నగదు పంపిణీ పథకాలకు దూరం పెట్టాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల తర్వాత చాలా జిల్లాల్లో వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు(Volunteers Resign) చేశారు. అయితే ఈసీ వాలంటీర్లను మాత్రమే పింఛన్ల పంపిణీకి వాడొద్దని తెలిపిందని, ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవచ్చని తెలిపిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎన్నికల సమయం కావడంతో ఏపీలో పింఛన్ల పంపిణీపై రాజకీయ విమర్శలు వస్తున్నాయి.