దిశ, ఫీచర్స్ : మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న వయస్సు, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయన్న విషయం తెలిసిందే. అయితే పురుషుల సంతాన సామర్థ్యంపై కూడా ఇవి ప్రతికూల ప్రభావం చూపుతాయని, ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ తగ్గుదలకు కారణం అవుతాయని సంతాన సాఫల్య నిపుణులు చెప్తున్నారు. అందుకు గల కారణాలను, పరిష్కారాలను సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.
సమస్యకు కారణం
వయస్సు రీత్యా సంభవించే శారీరక మార్పులు, మానసిక ఒత్తిడి, పోషకాలు లేని ఆహారపు అలవాట్లు పురుషుల్లో వీర్యం తగ్గడానికి కారణం అవుతాయని నిపుణులు అంటున్నారు. దీనివల్ల పలువురు సంతాన లేమి సమస్యలను ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. అయితే ఒత్తిడిని తగ్గించుకోవడం, జీవన శైలిలో, ఆహారపు అలవాట్లలో సానుకూల మార్పులు చేసుకోవడంతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొంటున్నారు.
అధిక బరువు కూడా..
అధిక బరువు, అధిక వ్యాయామాలు లేదా వయస్సుకు తగిన బరువు లేకపోవడం వంటివి కూడా స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. పురుషుల్లో అయితే ఇది స్పెర్మ్ కౌంట్ తగ్గుదలకు కారణం కావచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి సరైన బరువును నిర్వహించేలా, తక్కువ బరువును అధిగమించేలా నిపుణుల సలహాలు పాటించాలని చెప్తున్నారు.
ఈ అలవాట్లతో నష్టం
తరచుగా అధిక వేడి వాతావరణంలో పనిచేయడం, బిగుతైన దుస్తులు ధరించడం వృషణాలపై ఒత్తిడిని పెంచుతుందని, ఈ పరిస్థితి కూడా వీర్యకణాల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అలాగే ధూమపానం, మద్యపానం అలవాట్లు స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి, తద్వారా సంతానలేమికి కారణం అవుతాయి. కాబట్టి వాటిని మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా చేస్తే బెటర్
ముందుగా పురుషులు తమలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి గల కారణాలకు మూలం తెలుసుకోవాలి. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదిస్తే సమస్యను బట్టి పరిష్కార మార్గం సూచిస్తారు. ఒత్తిడి, జీవన శైలి, ఆహారపు అలవాట్లు మీలో సమస్యకు కారణమైతే వాటిలో సానుకూల మార్పులు అవసరం అవుతాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా జింక్, సెలీనియం, విటమిన్ సి, ఇ వంటి పోషకాలు కలిగిన తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, ప్రోటీన్లు కలిగిన ఆహారాలు స్పెర్మ్ కౌంట్ ఉత్పత్తి పెరగడంలో కీలకపాత్ర పోషిస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. ఒత్తిడి, ఆరోగ్యం వంటి విషయాల్లో అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.