ఈ మధ్య కాలంలో ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన సినిమా ‘హనుమాన్’. ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది.
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సూపర్ హీరో మూవీ జనవరి 12న థియేటర్లలో విడుదలై.. వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. అందుకే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూశారు.
‘హనుమాన్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 సొంతం చేసుకుంది. నిజానికి మార్చి 8 నుంచి జీ5 లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని న్యూస్ వినిపించింది. దీంతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. కానీ మార్చి 8న ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టలేదు. ఆ తర్వాత మార్చి 16న అన్నారు. అయితే కేవలం హిందీ వెర్షన్ రానుందని తెలియడంతో ప్రేక్షకులు నిరాశచెందారు. కానీ ఒకరోజు ఆలస్యంగా నేడు(మార్చి 17) తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలోనూ ఈ మూవీ సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశముంది.
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్రఖని, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. గౌరహరి, అనుదీప్ దేవ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా దాశరధి శివేంద్ర, ఎడిటర్ గా సాయి బాబు వ్యవహరించారు.