మంచి కాఫీలాంటి సినిమా ‘ఆనంద్’తో టాలీవుడ్‌లో ఓ కొత్త ఒరవడిని సృష్టించి సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. ఆ తర్వాత చేసిన సినిమాలు గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా, లవ్‌స్టోరీ వంటి సినిమాలు కూడా సున్నితమైన అంశాలు, చక్కని ఎమోషన్‌తో కూడిన సినిమాలే. అలా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న శేఖర్ కమ్ముల ఇప్పుడు రూటు మార్చి కమర్షియల్ ఎంటర్‌టైనర్ వైపు అడుగులు వేస్తున్నాడు. తన మార్క్ కథను పక్కనపెట్టి మాఫియా నేపథ్యంలో సాగే కథను సిద్ధం చేసుకున్నాడు.
కోలీవుడ్ హీరో ధనుష్ హీరోగా రూపొందే ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ధనుష్‌కి ఇది 51వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ను సంగీత దర్శకుడుగా ఎంపిక చేసుకోవడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. శేఖర్ కమ్ముల తన సినిమాలకు ఎక్కువ శాతం కె.ఎం.రాధాకృష్ణన్, మిక్కీ జె. మేయర్ వంటి సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్లకే ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఇప్పుడు అనూహ్యంగా దేవిశ్రీప్రసాద్‌ను తీసుకోవడంతో మొత్తంగా శేఖర్ కమ్ముల సినిమా లుక్ మారిపోయింది. ఇంకా ఈ సినిమాలో ఇలాంటి విశేషాలు చాలా ఉంటాయని తెలుస్తోంది. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జనవరి 18న ప్రారంభించారు. ధనుష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తారు.