రాను రాను రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మీ చరిత్ర మేం విప్పుతాం అంటే, మీ చరిత్ర గుట్టు మేం రట్టు చేస్తాం అంటున్నట్లు సాగుతున్నాయి. 2014 నుంచి 2019 వరకు వచ్చేసరికి ఇలాంటివి పెద్దగా కనిపించలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వైకాపా ఏ విధంగా సంపాదించుకుందాం, ఏ విధంగా తమ ముద్ర చూపిద్దాం అనుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. కానీ రాను రాను మంత్రులు, ఎమ్మెల్యేలు సంపాదనలో పడ్డారు. జగన్ వారించే ప్రయత్నం చేయలేదు. కంట్రోలు చేయలేదు. దాంతో విచ్చలవిడితనం పెరిగిపోయింది.
ఇప్పుడు 2024లో కొత్త ప్రభుత్వం వచ్చాక కొత్త తరహా రాజకీయాలు ప్రారంభమయ్యాయి. మును ముందు కూడా ఇవి కొనసాగుతాయి. ఎందుకంటే ఒకసారి ఒకరు మార్గం చూపిస్తే, మరొకరు కూడా అదే బాటలో వెళ్లడం కామన్. అయిదేళ్ల పాలనలో వైకాపా జనాల ఇష్టా రాజ్యం ఇప్పుడు బయట పెడుతున్నారు. రోజూ పదుల కొద్దీ జనాలు తిరుపతి ప్రత్యేక దర్శనం,సేవలు చేయించుకున్న వైనాలు బయటకు వస్తున్నాయి.
గత ప్రభుత్వ విధానాలు, వాటి నష్టాలు, పర్యవసానాలు ప్రభుత్వం బయటపెడుతోంది. అదే సమయంలో వివిధ శాఖల్లో జరిగిన చిలకకొట్టు వ్యవహారాలు కూడా బయటకు వస్తున్నాయి.నిజానికి ఇది ఒక రకంగా మంచిదే. మనం ఎన్నుకున్న వారు ఎలా వక్రమార్గంలో వెళ్లారు అన్నది మనకు క్లారిటీ వస్తుంది. తరువాత వచ్చే వాళ్లు కూడా కాస్త జాగ్రత్తగా వుంటారు. తమ బాగోతాలు కూడా ముందు ముందు బయటకు వచ్చే ప్రమాదం వుందని కాస్తయినా జాగ్రత్తగా వుంటారు.
ప్రభుత్వ శాఖల్లో సాదా సీదా జనానికి కనిపించని అవకాశాలు బోలెడు వుంటాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోకల్ ప్రజా ప్రతినిధులు వీటిని అడ్డంపెట్టుకుని తమ హవా సాగిస్తుంటారు. ఇలాంటివి అన్నీ కూడా బయటకు రావాల్సి వుంది. ఈ రోజుల్లో అన్నీ రికార్డ్ గానే వుంటాయి. అన్నీ కంప్యూటర్లలో భద్రంగా వుంటాయి. అది ఏ శాఖ అయినా కూడా.
పనిలోపనిగా ఏ శాఖలో అయినా బినామీ వ్యవహారాలు జరిగితే అవీ బయటకు తీయాలి. వివిధ శాఖల్లో చిన్న చిన్న కాంట్రాక్టులు అన్నీ బినామీలకే ఎక్కువగా వుంటాయి. అధికారులు బయట పెట్టాలే కానీ ఇలాంటివి బయటకు లాగడం పెద్ద కష్టం కాదు. ఇవన్నీ సోషల్ మీడియా ద్వారా బట్టబయలు అయితే అప్పుడు కానీ ఇవి కాస్త అరికట్టవు.
అంతే కాదు, విశాఖ లాంటి నగరాల్లో గత పది ఇరవై ఏళ్లుగా ఎన్నో ప్రభుత్వ స్ధలాలు, గెడ్డలు, కాలవలు ఆక్రమణకు గురయ్యాయి. అవన్నీ బయటకు రావాలి. ఎవరు ఎలా అడ్డదారిన ఉద్యోగాలు సంపాదించారో ఇలాగే బయటకు రావాలి.
ఇకపై ఇలా అయిదేళ్ల తరువాత కాకుండా ఎప్పటికప్పుడు అన్ని విషయాలు బయటకు వచ్చే మార్గం వుంటే చూడాలి.
The post కుళ్లు అంతా బయటకు రావాల్సిందే appeared first on Great Andhra.