దిశ, ఫీచర్స్ : చిన్న పిల్లలు సహజంగానే ముద్దొస్తుంటారు. అయితే కొందరు తమ ఇండ్లల్లో లేదా బయటకు వెళ్లినప్పుడు చిన్నారులు కనిపిస్తే క్యూటీ, బ్యూటీ అంటూ చెంపలను టచ్ చేయడం, లాగడం, ముద్దు పెట్టడం వంటివి చేస్తుంటారు. అలాగే పేరెంట్స్, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కూడా తమ ప్రేమను వ్యక్త పరిచే క్రమంలో పిల్లల చెంపలపై, పెదవులపై ముద్దులు పెడుతుంటారు. అప్పుడప్పుడూ ఏమో కానీ తరచుగా ఇలా ముద్దు పెట్టుకోవడం శిశువుల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. అదెలాగో చూద్దాం.
* శిశువులు లేదా ఏడాదిలోపు చిన్నారులు ఎవరైనా సరే వారిని ఎక్కువసార్లు కిస్ చేయడంవల్ల, కిస్ చేసేవారు ఇన్ఫెక్షన్లు, ఇతర అంటు వ్యాధులు కలిగి ఉంటే పిల్లలకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది. అలాగే అన్ని రకాల వ్యాక్సిన్లు వేయలేని చిన్నారులు కొన్ని సాధారణ వ్యాధులకు కూడా సున్నితంగా ఉంటారు. దగ్గు, జలుబు వంటివి ఉన్నప్పుడు వారిని ముద్దాడితే అది వారికి కూడా సోకుతుంది.
* శిశువుల చెంపలు, పెదవులుపై పదే పదే ముద్దు పెట్టుకోవడంవల్ల ఫ్లూ, న్యుమోనియా, ఇతర శ్వాస కోశ వ్యాధులు వారికి వ్యాపిస్తాయి. ముద్దు పెట్టిన వ్యక్తికి హెపటైటిస్ బి ఉంటే గనుక, లాలాజలం ద్వారా శిశువులకు కూడా వ్యాపిస్తుంది. దీంతో పాటు హెర్పస్ వైరస్ కూడా సోకుతుంది.
* చిన్నారులను ముద్దు పెట్టుకోవడం తప్పుకాదు కానీ, మీరు అన్ని సందర్భాల్లో ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్, కుటుంబ సభ్యులు బయటి వ్యక్తులు ముద్దు పెట్టడాన్ని అనుమతించకపోతే చిన్నారుల ఆరోగ్యానికి మంచిది.
* పిల్లలను ముద్దు పెట్టుకోవాలనుకుంటే గనుక వారి పెదవులు, చెంపలు కాకుండా నుదురు, మెడ, చేతులు, కాళ్లు, చేతులు, కడుపు వంటి భాగాల్లో కిస్ చేయవచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, అంటు వ్యాధులు సోకే అవకాశం తక్కువ.
* అప్పుడప్పుడే స్కూళ్లకు వెళ్లే చిన్నారుల్లోనూ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వారు వైరల్ ఇన్ఫెక్షన్లు, ఇతర అంటు వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువ. అందుకే ఏడాదిలోపు చిన్నారులను కూడా పెదవులు, చెంపలపై ముద్దు పెట్టడమ మంచిది కాదు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. నిపుణుల ప్రకారం.. ఏ వయస్సు వారైనా సరే పెదవులపై ముద్దు పెట్టడం అంత సురక్షితం కాదు. లాలాజలం ద్వారా ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంది. దగ్గు, జలుబు, ఫ్లూ, హెపటైటిస్ వంటి లక్షణాలు ఉన్న సమయంలో చిన్నారులకే కాదు, పెద్దలు కూడా కిస్ చేసుకోవడం సేఫ్ కాదు.