మూవీ: ఖూఫియా
నటీనటులు: టబు, ఆశిష్ విద్యార్థి, అలీ ఫజల్, వామికా గబ్బీ, అతుల్ కులకర్ణి తదితరులు
సంగీతం: విశాల్ భరద్వాజ్
ఎడిటింగ్: ఎ. శ్రీకర ప్రసాద్
సినిమాటోగ్రఫీ: ఫర్హద్ అహ్మద్
నిర్మాతలు: రేఖా భరద్వాజ్, విశాల్ భరద్వాజ్
దర్శకత్వం: విశాల్ భరద్వాజ్
ఓటిటి: నెట్ ఫ్లిక్స్
అమర్ భూషణ్ రచించిన ‘ఎస్కేప్ టు నో వేర్’ నవల ఆధారంగా విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన మూవీ ‘ఖూఫియా’. టబు, ఆశిష్ విద్యార్థి, వామీకా గబ్బీ, అలీ ఫజల్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ కథేంటో చూసేద్దాం.
కథ:
ఢిల్లీలోని ‘రా’ కార్యాలయంలో జాబ్ చేసే రవి మోహన్(అలీ ఫజల్) పక్కదేశాలకి టాప్ సీక్రెట్ ని చేరవేస్తున్నాడనే అనుమానంతో కేఎమ్(టబు)ని నిఘా పెట్టమని జీవ్(ఆశిష్ విద్యార్థి) ఆదేశిస్తాడు. ఆ తర్వాత ఆపరేషన్ బ్రూటస్ పేరుతో కేఎమ్ రంగంలోకి దిగుతుంది. కేఎమ్ రవి మోహన్ ని ఫాలో అవుతుంటుంది. అయితే ఈ ఆపరేషన్ లో భాగంగా హీనా రెహమాన్(అజ్మేరీ) బంగ్లాదేశ్ లోని ఢాకాకి వెళ్తుంది. అలా వెళ్ళిన హీనా శవమై వస్తుంది. అసలు తనని చంపిందెవరు? హీనా, కేఎమ్ ల మధ్య సంబంధం ఏంటి? కేఎమ్ టీమ్ కి ఎదురైన సవాళ్ళేంటి? జీవ్ అనుమానం నిజమేనా? ఇలాంటి వాటికి సమధానం తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లోని ఈ సినిమాని చూడాల్సిందే.
విశ్లేషణ:
బంగ్లాదేశ్ లోని ఢాకాలో హీనా అనే ఒక ఇండియన్ ‘రా’ ఏజెంట్ ని చంపేయడంతో కథ ఆసక్తికరంగా ప్రారంభమైంది. అయితే ఆ ఆసక్తిని డైరెక్టర్ తర్వాత కొనసాగించలేకపోయాడు. మళ్ళీ కథ ఇండియాలోని ‘రా’ కార్యాలయంలో జరుగుతున్నట్టు ఒక మిషన్ గురించి సాగుతున్నట్టు చూపించిన విధానం బాగుంది.
కార్గిల్ వార్ తర్వాత ఇండియా, పాకిస్తాన్ ల మధ్య జరిగిన ఒక సీక్రెట్ మిషన్ లో భాగంగా సాగే కథనం బాగుంది. కానీ దీనిని సరైన పద్దతిలో ప్రెజెంట్ చేయడంలో విఫలమ్యాడు డైరెక్టర్ విశాల్ భరద్వాజ్. ఒక సీరియస్ ‘స్పై’ థ్రిల్లర్ ని ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ చేసి కథని డిస్టబ్ చేశాడు. ప్రేక్షకుడి కథలో ఇన్వాల్వ్ అయ్యాడనుకున్న ప్రతీసారీ ఫ్యామిలీతో ఎమోషన్ ని నడిపించాడు. అయితే ‘రా’ కార్యాలయం లోని ఒకతను టాప్ సీక్రెట్ అయినటువంటి కొన్ని ముఖ్యమైన పత్రాలను పక్క దేశానికి చేరవేస్తుంటాడు. అది కనిపెట్టిన కేఎమ్ అతడిని ఫాలో చేస్తుంటుంది. అయితే ఈ ప్రాసెస్ లో తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని సంఘటనలను చూపించడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా వామికా గబ్బీ హాట్ అండ్ బోల్ట్ సీన్స్ ఇబ్బందికరంగా ఉంటాయి.
ఈ సినిమాని కుటుంబంతో కలిసి చూడకపోవడమే బెటర్. ఎందుకంటే చాలా చోట్ల బోల్డ్ సీన్స్ ఉంటాయి. ఇంకా ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారనేమో ఇష్టమొచ్చినట్టు అసభ్య పదజాలాన్ని వాడారు. కేఎమ్ పాత్ర ప్రతీ ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. స్పై థ్రిల్లర్ సినిమాలకి బిజిఎమ్ బాగుండాలి కానీ ఈ సినిమాకి విశాల్ భరద్వాజ్ సమకూర్చిన సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోతుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ లో ఇంకా కత్తెర వాడాల్సింది. చాలా వరకు ఎడిట్ చేయకుండా రా ఫుటేజ్ ని అలానే ఉంచేశాడు. కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేది. ఫర్హద్ అహ్మద్ సినిమాటోగ్రఫీ బాగుంది.
నటీనటుల పనితీరు:
‘రా’ ఆఫీసర్ గా టబు ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచింది. ఆశిష్ విద్యార్థి నటన ఆకట్టుకుంది. వామికా గబ్బీ అందంతో ఆకట్టుకుంది. మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేరకు నటించారు
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
స్పై థ్రిల్లర్ జానర్ సినిమాలని ఇష్టపడే వారికి ఈ సినిమా నిరాశనే మిగిలిస్తుంది. సీక్రెట్ మిషన్ నేపథ్యంలో సాగే ఈ కథని కామన్ ఆడియన్స్ ఒకసారి ట్రై చేయొచ్చు.
రేటింగ్: 2/5
✍🏻. దాసరి మల్లేశ్