తెలుగు సినిమా పాటల ప్రపంచంలో మరో విషాదం చోటు చేసుకుంది. తన గానంతో పండిత పామరుల్ని మైమరిమింపచేసిన గాయకుడు భువి నుంచి దివికి పయనమయ్యాడు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రముఖ సినీ, జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం మరణించారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నఆయన కొద్దిసేపటి క్రితమే సికింద్రాబాద్ పద్మారావు నగర్ లో ఉన్న తన స్వగృహంలో మరణించారు. పవన్ కళ్యాణ్ హీరోగా 2012 లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలోని గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల అనే పాట పాడింది శ్రీనివాస్ నే. ఆయన స్వరం నుంచి వచ్చిన ఆ పాట ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే .నేటికీ ఆ పాట వస్తే పూనకంతో ఊగిపోయే అభిమనులు చాలా మంది ఉన్నారు. అదంతా శ్రీనివాస్ గొంతు మహత్యం అని చెప్పవచ్చు
సినీ పాటలే కాకుండా ఎన్నో జానపద సాంగ్స్ ని కూడా శ్రీనివాస్ పాడారు. కాలికి గజ్జె కట్టి పాట పాడుతూ చిందు వేసాడంటే అందరు డాన్స్ చెయ్యాల్సిందే.ఆయన పాడిన ఎన్నో పాటలు నేటికీ తెలంగాణలోని చాలా పల్లెల్లో మారుమోగిపోతుంటాయి. ఆయన మృతిపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, కవులు,మేధావులు తమ సంతాపాన్ని తెలియచేసారు.