‘గేమ్ ఛేంజర్’ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ సినిమా వినాయక చవితి కానుకగా ఈ ఏడాది సెప్టెంబర్ 6న విడుదల కానుందని వార్తలు వినిపిస్తుండగా.. వామ్మో ఆ తేదీకా! అంటూ చరణ్ ఫ్యాన్స్ భయపడిపోతున్నారు. దానికి కారణం 11 ఏళ్ళ క్రితం ‘తుఫాన్’ చేసిన గాయమే.
‘చిరుత’, ‘మగధీర’, ‘రచ్చ’, ‘నాయక్’ వంటి విజయాలతో తక్కువ సమయంలో స్టార్ గా ఎదిగిన చరణ్.. కెరీర్ ప్రారంభంలోనే బాలీవుడ్ ప్రయత్నాలు చేశాడు. అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘జంజీర్’ను అదే పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తెలుగులో ‘తుఫాన్’ పేరుతో వచ్చింది. 2013 సెప్టెంబర్ 6న విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. క్లాస్ ఫిల్మ్ ని చెడగొట్టారంటూ విమర్శలు వచ్చాయి. చరణ్ లుక్స్ పైన, యాక్టింగ్ పైన బాలీవుడ్ మీడియా ట్రోల్స్ చేసింది. వాటన్నింటికీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో చరణ్ అదిరిపోయే సమాధానం చెప్పినప్పటికీ.. ‘తుఫాన్’ చేసిన గాయం మాత్రం ఇంకా ఫ్యాన్స్ ని వెంటాడుతూనే ఉండి. అందుకే ఆ తేదీకి సినిమా అంటే భయపడిపోతున్నారు.
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే దర్శకుడు శంకర్ ‘ఇండియన్-2’తో బిజీ కావడంతో ‘గేమ్ ఛేంజర్’ ఆలస్యమవుతూ వస్తోంది. అయినప్పటికీ ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని చరణ్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వీరి ఎదురుచూపులు ఫలించి ‘గేమ్ ఛేంజర్’ని సెప్టెంబర్ 6న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో మొదట సంబరపడిన అభిమానులు.. ఇప్పుడది ‘తుఫాన్’ విడుదలైన డేట్ అని తెలిసి ఆందోళన చెందుతున్నారు. కాస్త ఆలస్యమైనా పర్లేదు.. వేరే డేట్ చూడమని కోరుతున్నారు. మరి ‘గేమ్ ఛేంజర్’ నిజంగానే సెప్టెంబర్ 6 నే విడుదలవుతుందా?.. ఒకవేళ విడుదలైతే ‘తుఫాన్’ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుందా? అనేది చూడాలి.