సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకున్న భామ మృణాల్ ఠాకూర్. ఆ ఒక్క సినిమాతో మృణాల్ నేటికీ ప్రేక్షకుల మనసులో అభినవ సీతగా ముద్రపడిపోయింది. ఈ మధ్య వచ్చిన హాయ్ నాన్న లో కూడా అధ్బుతమైన పెర్ఫార్మ్ ని ప్రదర్శించి తెలుగు సినిమాకి కాబోయే నెంబర్ వన్ హీరోయిన్ అనే టాగ్ లైన్ తో ముందుకు దూసుకుపోతుంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి.
మృణాల్ సినిమాల్లో అవకాశాలు కోసం ప్రయత్నించేటప్పుడు చాలా మంది తన ఆకారం మీద కామెంట్ చేసారు.అసలు గ్లామర్ షో లకి కూడా మృణాల్ పనికి రాదని చెప్పారు. ఒక సినిమా ఆడిషన్ కి వెళ్తే మృణాల్ ని చూసిన ఫోటోగ్రాఫర్ పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయిలాగా ఉందని కామెంట్ చేసాడు. మృణాల్ చెప్పిన ఈ విషయాలన్నీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.అలాగే తన కెరీర్ కి సంబంధించిన మరిన్ని విషయాలని కూడా ఆమె ప్రేక్షకులతో పంచుకుంది. తనకి బాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్నా కూడా తెలుగులో వచ్చినన్ని మంచి క్యారక్టర్ లు రావడంలేదని చెప్పింది.
అందుకే బాలీవుడ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించడంలేదని సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేశాను అన్నది ముఖ్యం కాదని చెప్పింది. మంచి క్యారక్టర్ పడితే ఒక్క సినిమా అయినా చాలు ఆ సినిమా ద్వారా ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలబడిపోతామని కూడా ఆమె చెప్పింది. ప్రస్తుతం మృణాల్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఫ్యామిలీ స్టార్ లో ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతుంది.