Chandrababu Health : స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే కొన్ని రోజులుగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు బరువు తగ్గారని, ఆయనకు సరైన సౌకర్యాలు కల్పించడంలేదని ఆరోపిస్తున్నారు. ఇటీవల జైలులో డీహైడ్రేషన్ గురైన చంద్రబాబు… తాజాగా స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన కీలక నివేదిక బయటకు వచ్చింది. అయితే పోలీసులు చెబుతున్న విషయాలకు భిన్నంగా వైద్యుల నివేదిక ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబుకు చేతులు, మెడ, ఛాతీ, గడ్డం, వీపు భాగాల్లో దద్దుర్లు, స్కిన్ అలర్జీ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఈనెల 12వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆదేశాలతో వైద్యులు జి.సూర్యనారాయణ, వి.సునీతదేవిలతో కూడిన వైద్యుల బృందం చంద్రబాబును పరీక్షించి జైలు అధికారులకు నివేదిక అందించారు. చంద్రబాబుకు చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో పాటు ఐదు రకాల మెడిసన్ ను వైద్యులు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.