ఆ ఇద్దరు తమ తమ రంగాల్లో ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా ఒదిగి ఉండే వ్యక్తులు.పైగా ఎవర్ని ఒక్క మాట అనకుండా ఆకాశమంత ఎత్తుకి ఎదిగిన మౌన మహర్షులు. ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు మెగాస్టార్ చిరంజీవి అయితే ఇంకొకరు వెంకయ్య నాయుడు.కొన్ని రోజుల క్రితం ఆ ఇద్దరికీ కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోనే రెండో అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డు ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
చిరంజీవి మరియు వెంకయ్య నాయుడు లకి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించనున్నారు. రేపు అనగా ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్న శిల్పకళా వేదికలో తెలంగాణ ప్రభుత్వం తరుపున చిరు వెంకయ్య నాయుడు లని రేవంత్ రెడ్డి అత్యంత ఘనంగా సత్కరించనున్నారు. ఈ కారక్రమంలో తెలంగాణ కి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. అలాగే పద్మశ్రీ పురస్కారాలని అందుకున్న మరో ఆరుగురిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్మానించబోతుంది.
ఎంతో అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో చిరంజీవి అండ్ వెంకయ్యనాయుడుల అభిమానులతో పాటు పలువురు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. చిరంజీవి వెంకయ్యనాయుడు ఇద్దరు ఎవరి అండా దండలు లేకుండా తమ తమ రంగాల్లో హిమాలయ శిఖరాలంత ఎత్తుకి ఎదిగి భావి తరాలకి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలోనే మెగాస్టార్ గా ఎదిగితే వెంకయ్య నాయుడు ఉపరాష్టపతిగా పని చేసారు. అలాంటి గొప్ప వ్యక్తులని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్మానించడం పట్ల తెలుగు వారందరు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.