రాజకీయాల్లో అన్నింటి సులభమైన వ్యవహారం ఎవరిమీదనైనా బురద చల్లడం. ఇతరత్రా ఏదైనా రంగాల్లో బురద చల్లడం కూడా ఒకింత కష్టం. ఒక ఆరోపణ చేస్తే దానికి సంబంధించి కించిత్తు ఆధారం అయినా చూపించాల్సి వస్తుంది.
రాజకీయాల్లో అలా కాదు. ఏ ఆధారమూ లేకుండానే ఇష్టం వచ్చినట్టుగా వాగవచ్చు. ఎలాంటి రీతిలోనైనా బురద చల్లేసి, ఆరోపణలు గుప్పించేసి.. ఆధారాలన్నీ తనవద్ద పుష్కలంగా ఉన్నాయని సమయం వచ్చినప్పుడు బయటపెడతానని.. ఎప్పటికీ ఆచరణలోకి రాని ఒక పనికిరాని మాటతో రోజులు నెట్టుకురావొచ్చు. నిర్మాణాత్మకంగా మాట్లాడేవాళ్లు.. ఉండరు గాక ఉండరు! ఆ క్రమంలోనే.. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా అనుచితమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తెలుగుదేశానికి చెందిన వారు మాత్రమే కాదు. వారు తమను పట్టించుకోకున్నా సరే.. తెలుగుదేశం తో జట్టుకట్టడానికి తహతహలాడుతున్న వామపక్షాలవారు కూడా ఇప్పుడు జగన్ మీద ఆరోపణలకు దిగుతున్నారు. ఇంతకూ ఏ విషయంలోనో తెలుసా..?
ఏపీ విభజన తర్వాత.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల పంపిణీకి సంబంధించి.. వివాదం తొలినుంచి నడుస్తూనే ఉంది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు నీళ్లు దక్కేలాగా పంపిణీ చేశారు. అయితే ఇందులో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ తొలినుంచి వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర కేబినెట్.. ఈ నీటికేటాయింపులను పునస్సమీక్షించడానికి నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతానికి జరిగింది.. కేటాయింపుల పునస్సమీక్షకు నిర్ణయం మాత్రమే. ఆ పర్వం పూర్తి కాలేదు. ఏపీ గతంలో దక్కిన కేటాయింపులు 512 టీఎంసీలలో కోత పడలేదు. అయినా అప్పుడే.. జగన్ వ్యతిరేక దళాలు అత్యుత్సాహంతో ఆయన మీద విషం చిమ్మడం ప్రారంభించేశాయి. కేంద్ర నిర్ణయం వెలువడిన రోజునే.. ఏపీ సర్కారు వాదనలు సరిగా వినిపించకపోవడం వల్లనే పునస్సమీక్ష దాకా వ్యవహారం వెళ్లినట్టుగా తొలుత పచ్చమీడియా కథనాలు వెల్లువెత్తించింది. తరువాత పచ్చ పార్టీలు అందుకున్నాయి. ఇప్పుడు ఎర్ర పార్టీలు కూడా అందుకున్నాయి.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఎం జగన్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. అయితే సీపీఐ రామకృష్ణ దృష్టిలో ఆ ప్రయత్నం చాలదుట. ఆయన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారట. పునస్సమీక్షలో ఏదో ఒకటి తేలితే.. ఆ తర్వాత ఎవరైనా జగన్ ను నిందించినా అర్థముంది. లేదా, అన్యాయం జరిగిన తర్వాత.. రాష్ట్రప్రభుత్వం స్పందించకుండా ఉంటే విమర్శలకు అర్థముంటుంది. అదేమీ లేకుండానే.. జగన్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని అనేవారు.. అసలు.. ఈ విషయంలో జగన్ ఏం చేస్తే బాగుంటుందో ఒక నిర్మాణాత్మక సలహా ఇవ్వగలరా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.