కొందరు నాయకులకు ప్రజలు ఏం అనుకుంటారనే పట్టింపులు పెద్దగా ఉండవు. ఎందుకంటే వారికి అసలు ప్రజలంటే గౌరవం ఉండదు. ఏదో ధన బలంతో నాయకులుగా, ఒక్కోసారి కాలం కలిసి వస్తే ప్రజా ప్రతినిధులుగా చెలామణీ అవుతూ ఉంటారు. ఫక్తు అవకాశవాదులుగా ముద్రపడినా సరే.. ఎవరి చేతిలో అధికారం ఉంటే వారి గూటిలోకి చేరుతూ తమ తమ వ్యక్తిగత వ్యాపారాలను నిరభ్యంతరంగా సాగించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో తాను కూడా ఒకడినే అని నిరూపిస్తూ గుంటూరు మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు.
పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన గిరి.. నగర అధ్యక్ష పదవిని, సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు లేఖను జగన్ కు పంపారు. 2019లో తెలుగుదేశం తరఫున గుంటూరు వెస్ట్ నుంచి గిరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అధికార పార్టీలో ఉండడం అనేది వ్యాపారాలకు ఉపయోగపడిందే తప్ప రాజకీయంగా బావుకున్నదేం లేదు.
ఆయనకు జగన్ గుంటూరు నగర పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు గానీ.. ఎన్నికల్లో టికెట్ మాత్రం దక్కలేదు. ఆయన నిరాశ పడినప్పటికీ పార్టీని మాత్రం వీడలేదు. తీరా జగన్ ఓడిపోయాక మళ్లీ గెలుస్తారనే నమ్మకం కూడా కనిపించకపోతుండగా.. ఆయన పార్టీని వీడారు.
మద్దాళి గిరి తిరిగి తెలుగుదేశంలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ తెలుగుదేశం తనకు నో ఎంట్రీ బోర్డు చూపిస్తే అవసరమైతే జనసేనలో అయినా చేరాలని అనుకుంటున్నట్టు సమచారం. మరొక వైపు ఈ రెండు పార్టీలు కూడా వైసీపీ నుంచి వచ్చే వారిని చేర్చుకోరాదని భావిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే మద్దాళి గిరి భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది.
వైసీపీలో చేరినందుకు సిటింగుగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు టికెట్ దక్కలేదు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తన పాలన పట్ల.. అనే సంగతి గుర్తించకుండా ఎమ్మెల్యే అభ్యర్థులను ఎడాపెడా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ క్రమంలో గిరిని కూడా పక్కన పెట్టారు. అప్పుడే ఏమీ చేయలేకపోయిన గిరి,.. ఇప్పుడు ఈసారి తనకు టికెట్ కావాలనే కండిషన్ తో తెదేపా, జనసేనల్లో చేరాలనుకుంటే ఆ పప్పులుడకవు.
కేవలం తన వ్యాపారాలకు అండగా ఉండడం కోసం చేరదలచుకుంటే వర్కవుట్ కావచ్చు. కానీ రాజకీయ భవిష్యత్తును మరచిపోవాల్సి ఉంటుంది. మరి గిరి ఏం చేయదలచుకున్నారో చూడాలి. ఇలాంటి అవకాశవాద నాయకుల చేరికలపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా చూడాలి.
The post జగన్ కు గిరి గుడ్ బై: ఏ గూటికి చేరేనో? appeared first on Great Andhra.