వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. నెలకొన్న అరాచక పరిస్థితుల గురించి.. విధ్వంసక హింసాత్మక పాలన గురించి జాతీయవ్యాప్తంగా దేశం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఇది.
అలాగని.. కేవలం జగన్ ఒక్కడే ఆ ధర్నాలో లేరు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో మాత్రం సరిపెట్టుకోలేదు కూడా. యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, శివసేన నేత సంజయ్ రౌత్, ఇంకా అనేక పార్టీల నేతలు వచ్చారు. సంఘీభావం తెలిపారు. అయినా కూడా జగన్ దీక్షకు జాతీయ మీడియాలో దక్కిన ప్రాధాన్యం ఎంత? ప్రాధాన్యం సంగతి పక్కన పెడదాం. అసలు జాతీయ మీడియా ఆయన దీక్షను పట్టించుకోనేలేదా? అనిపిస్తోంది. ఏ ప్రముఖ ఛానెళ్లలో, వారి వెబ్ సైట్లలో జగన్ దీక్ష గురించిన కథనాలు లేకపోవడం విశేషం.
నిజానికి జగన్ ఢిల్లీలో తలపెట్టిన ధర్నా విజయవంతం అయింది. చంద్రబాబు హింస రాజకీయాలను, దుర్మార్గాలను దేశంలోని ఇతర పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్లాలనుకున్న జగన్ ప్రయత్నం ఫలించింది. అఖిలేష్ యాదవ్ ధర్నాలో పాల్గొని జగన్ కు మద్దతు తెలియజేశారు. ఏపీలోని అరాచకత్వాన్ని తెలియజేసే వీడియోలను కూడా చూశారు. అలాగే శివసేన నేత సంజయ్ రౌత్ వచ్చి జగన్ కు మద్దతు తెలిపారు. కూటమి విధ్వంసాల గురించి నిరసన వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులోని వీసీకే తదితర అనేక పార్టీలనేతలు జగన్ వెంట నిలిచారు. అయినా జాతీయ మీడియాకు వారెవ్వరూ కనిపించనేలేదు.
ఇదేం తీరు జగన్!
సాధారణంగా పార్టీలకు మీడియా మేనేజిమెంట్ అనే ఒక ప్రత్యేకమైన ప్రయాస ప్రతిసందర్భంలోనూ ఉంటుంది. మరి జగన్, వైసీపీ వారి మీడియా మేనేజిమెంట్ ఇంత పూర్ గా ఉన్నదా? అని చూసిన వారు అనుకుంటున్నారు. జాతీయ మీడియాలో చిన్న వార్త వచ్చినా, పబ్లిసిటీ పెద్దగా ఉంటుందని జగన్ ను భ్రమల్లో పెడుతూ.. గతంలో ఆయన పాలనలో ఉన్న రోజుల్లో విజయ్ కుమార్ రెడ్డి, ఐప్యాక్ ప్రతినిధులు జగన్ ను మభ్యపెట్టి కోట్లాది రూపాయలు.. ఢిల్లీ మీడియాకు ధారపోసినట్టుగా పుకార్లున్నాయి.
జగన్ అదివరలో ఎన్నడూ లేని విధంగా.. ఢిల్లీలో జాతీయ మీడియాతో సత్సంబంధాలు నెరపడం కోసమే అన్నట్టుగా ఒక కేబినెట్ ర్యాంకు పదవిని సృష్టించి దేవులపల్లి అమర్ కు అప్పగించారు కూడా. మరి వారందరి ప్రయత్నాలు, వారు తగలేసిన కోట్లరూపాయల డబ్బు అన్నీ ఎక్కడకు పోయాయనేది పార్టీ కార్యకర్తల ఆవేదనగా ఉంది.
జగన్ ఇప్పటికైనా మేలుకోవాలని.. తన చుట్టూ చేరి తనను మభ్యపెడుతున్న వాళ్లు.. కనీసం జాతీయ మీడియాలో వార్తలు వచ్చేలా చేయలేని అసమర్థులు అని గ్రహించాలి. ఇదేమీ పైరవీ వార్త గానీ, ఆబ్లిగేషన్ గానీ కానే కాదు. ఢిల్లీలో ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వందల మంది ప్రజాప్రతినిధులు, నాయకులతో పెద్ద ఎత్తున దీక్ష చేస్తే, ఒక రాష్ట్రంలో హత్యారాజకీయాల తీరును నిరసిస్తే.. జాతీయ మీడియా తమంతట తాము స్పందించి కవరేజీ సంగతి చూడాలి. పోనీ వారు రాలేదనే అనుకుందాం.. మరి ఇన్నాళ్లూ ప్రభుత్వ సొమ్మును, పార్టీ సొమ్మును వారికి ప్రత్యక్ష , పరోక్ష మార్గాల్లో దోచిపెట్టిన లైజానింగ్ ప్రముఖులు ఇప్పుడు ఏమైపోయారనేది పార్టీ కార్యకర్తల ఆవేదన!
సరైన ప్రచారాన్ని ప్లాన్ చేసుకోలేనప్పుడు.. జగన్ ఎంత కష్టపడినా దాని వలన ఫలితం ఉండదని తెలుసుకోవాలి. అలాగే, తన చుట్టూ చేరి మాటలు చెబుతూ మభ్యపెడుతున్న వారిని మారిస్తే తప్ప.. పరిస్థితులు మెరుగుపడవని కూడా ఆయన గ్రహించాలి… అని కార్యకర్తలు, నాయకులు కోరుకుంటున్నారు.
The post జగన్.. తస్మాత్ జాగ్రత్త! appeared first on Great Andhra.